
రాష్ట్రంలో అరాచకపాలన
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ విశాఖ జిల్లా అధ్యక్షుడు బాజి నాయుడు మండిపడ్డారు. కూటమి ఏడాది పాలనలో ప్రజాస్వామ్యాన్ని తూట్లు పొడుస్తూ ‘రెడ్ బుక్’ రాజ్యాంగాన్ని అమలు చేస్తోందన్నారు. మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రశ్నించే గొంతులను నొక్కేందుకు వైఎస్సార్ సీపీ ప్రజా ప్రతినిధులు, మాజీ మంత్రులపై అరెస్టులు, దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. లిక్కర్ స్కామ్ పూర్తిగా కల్పితమని, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టును ఖండిస్తున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చాక విశాఖలో మాదకద్రవ్యాల వినియోగం, హత్యలు, మహిళలపై అఘాయిత్యాలు, దోపిడీలు పెరిగి శాంతిభద్రతలు లోపించాయని ఆవేదన వ్యక్తం చేశారు. శాంతిభద్రతలపై దృష్టి సారించేలా పోలీసులకు ప్రత్యేక అధికారాలు ఇవ్వాలని గవర్నర్‌ను కోరారు. లీగల్ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి పాకా సత్యనారాయణ మాట్లాడుతూ ఎన్నికల హామీలు అమలు కాలేదని, వైఎస్సార్ సీపీ నేతలపై కక్షపూరిత దాడులు, కేసులను ఖండించారు. లీగల్ సెల్ జిల్లా మాజీ అధ్యక్షుడు కరణం కృష్ణ మాట్లాడుతూ కూటమి పాలనలో మద్యం విక్రయాలు విచ్చలవిడిగా పెరిగాయని, పచ్చ పత్రికల్లో రాసిన కథనాల ఆధారంగా సిట్ దర్యాప్తు సాగుతోందని ఆరోపించారు. లా నేస్తం కింద జూనియర్ లాయర్లకు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నెలకు రూ.5,000 స్టైఫండ్ ఇచ్చిందని, కూటమి ప్రభుత్వం రూ 10,000 ఇస్తామని చెప్పి ఏడాదైనా ఇవ్వలేదన్నారు. లీగల్ సెల్ రాష్ట్ర సెక్రటరీ వుడా శ్రీనివాసరావు మాట్లాడుతూ లిక్కర్ స్కాం 2014–19 మధ్య జరిగిందని ఆరోపించారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ప్రభుత్వ ఆధీనంలో మద్యం విక్రయించి ఆదాయాన్ని పెంచుతూ, వినియోగాన్ని నియంత్రించారని తెలిపారు. సమావేశంలో లీగల్ సెల్ నాయకులు వాగుపల్లి చిన్నారావు, దాసరి గణేష్, సీఐ సత్యనారాయణ, మొల్లి రామారావు, ఆర్‌ఎస్ రవి, మొల్లి సింహాద్రి, సూరిశెట్టి అనిల్, సియాద్రి రవి, సూరిశెట్టి శ్రీనివాసరావు, ఆకెళ్ల వెంకటరమణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ నాయకుల ధ్వజం