
మరణించి.. మరో నలుగురికి వెలుగునిచ్చి..
నేత్రదానంతో మానవత్వాన్ని చాటుకున్న రమేష్ కుటుంబం
పెందుర్తి: పొట్ట చేత పట్టుకుని వలస వచ్చిన ఓ ఎలక్ట్రీషియన్‌ను మృత్యువు కబళించినా, అతడు మరణానంతరం నలుగురికి చూపునిచ్చి వెలుగునింపాడు. గుండెపోటుతో మరణించిన ఆ వ్యక్తి నేత్రాలను దానం చేసి, అతని కుటుంబం గొప్ప మానవత్వాన్ని చాటుకుంది. ఏలూరుకు చెందిన 34 ఏళ్ల మీరపురెడ్డి రమేష్ వృత్తి రీత్యా ఎలక్ట్రీషియన్. నెల రోజుల కిందట పెందుర్తి మండలం అక్కిరెడ్డిపాలెంలోని ఒక కంపెనీలో పనికి కుదిరాడు. గురువారం రాత్రి విధులు ముగించుకుని తన గదికి వచ్చిన రమేష్‌కు తీవ్రమైన గుండెపోటు రావడంతో పాటు ఫిట్స్ వచ్చి అక్కడికక్కడే మరణించాడు. ఈ క్రమంలో రమేష్ మృతదేహాన్ని తరలించేందుకు ఫ్రీజర్ బాక్స్ కోసం పెందుర్తిలోని సాయి హెల్పింగ్ హ్యాండ్స్ ప్రతినిధి దాడి శ్రీనివాస్‌ను కుటుంబ సభ్యులు సంప్రదించారు. శ్రీనివాస్ చొరవ తీసుకుని, రమేష్ కళ్లు దానం చేస్తే మరో నలుగురికి కంటి చూపు వస్తుందని కుటుంబ సభ్యులను ఒప్పించారు. రమేష్ తల్లి చంటమ్మ, సోదరుడు మహేష్ అంగీకరించడంతో.. వెంటనే అక్కడికి చేరుకున్న ఎల్.వి.ప్రసాద్ సారథ్యంలోని మోషన్ ఐ బ్యాంక్ ప్రతినిధులు నగేష్ నేత్రాలను సేకరించి, సురక్షితంగా ఆసుపత్రికి తరలించారు. పుట్టెడు దుఃఖంలోనూ రమేష్ కుటుంబ సభ్యులు చూపిన మానవత్వంపై స్థానికంగా ప్రశంసలు వెల్లువెత్తాయి.

మరణించి.. మరో నలుగురికి వెలుగునిచ్చి..