
విశాఖలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలి
విశాఖ లీగల్: విశాఖలో హైకోర్టు బెంచ్‌ను తక్షణమే ఏర్పాటు చేయాలని ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ రాష్ట్ర అధ్యక్షుడు కె.సురేష్‌కుమార్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఉదయం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని న్యాయస్థానాల వెలుపల అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. విశాఖలో జరిగిన ధర్నాలో పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షుడు కె.ఎస్.ఎస్. సురేష్‌కుమార్ మాట్లాడుతూ న్యాయవాదుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. న్యాయవాదుల రక్షణ చట్టంలో మార్పులు, నూతన న్యాయస్థానాల నిర్మాణం, ఖాళీగా ఉన్న న్యాయమూర్తుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలన్నారు. మహిళా న్యాయవాదులకు విశ్రాంతి గదులు ఏర్పాటు చేయాలని, న్యాయవాదుల మరణానంతరం ప్రయోజనాలను రూ.6 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాలని విజ్ఞప్తి చేశారు. అలాగే జూనియర్ న్యాయవాదులకు రూ.10వేల గౌరవ భృతిని కల్పించాలని, విశాఖపట్నంలో రైల్వే ట్రిబ్యునల్ ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం న్యాయవాదుల బృందం డీఆర్వో భవానీశంకర్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సంఘ ప్రతినిధులు ఎం.ఎన్. భగవతి, అజయ్ కుమార్, ఇందిర, శైలజ, పి.మాధురి, వేణు సుబ్రహ్మణ్యం, జి.సుశీల, వి.ఆర్.ఝాన్సీ, అధిక సంఖ్యలో న్యాయవాదులు పాల్గొన్నారు.