
దక్షిణాదిలో ఉత్తమ సంస్థగా ప్రభుత్వ పాత ఐటీఐ
కంచరపాలెం: కంచరపాలెం ప్రభుత్వ పాత ఐటీఐ కళాశాల ‘భారత్ స్కిల్ ఎన్‌ఎక్స్‌టీ–2025’అవార్డును అందుకుని, దక్షిణ భారతదేశంలోనే ఉత్తమ పారిశ్రామిక శిక్షణ సంస్థగా నిలిచిందని ఆ కళాశాల ప్రిన్సిపాల్ జె. శ్రీకాంత్ తెలిపారు. మంగళవారం ఢిల్లీలో జరిగిన అవార్డు ప్రదానోత్సవంలో కేంద్ర మంత్రులు జయంత్ చౌదరి, సుకాంత మజుందార్ చేతుల మీదుగా ఉపాధి, పారిశ్రామిక శిక్షణ శాఖ డైరెక్టర్ జి.గణేష్ కుమార్, అడిషనల్ డైరెక్టర్ జి.సుబ్రహ్మణ్యం, ప్రిన్సిపాల్ జె. శ్రీకాంత్ ఈ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ఈ విజయానికి కృషి చేసిన శాఖ ఉన్నతాధికారులకు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.