
కిడ్నీ మహమ్మారి
కబళిస్తున్న
భద్రయ్యపేట గ్రామం
15 ఏళ్లుగా మృత్యువుతో పోరాడుతున్నాడు కృష్ణ. అతనికి కాళ్లు విరిగినప్పుడు కాదు.. కిడ్నీలు పాడయ్యాయని తెలిసినప్పుడు జీవితం అగమ్యగోచరంలా మారింది. కేవలం కృష్ణ ఒక్కడే కాదు, అతని తల్లి, తమ్ముడు, భార్య.. ఇలా అతని కుటుంబంలో నలుగురు ఇదే మహమ్మారితో యుద్ధం చేస్తున్నారు. ఇది కేవలం కృష్ణ కుటుంబ కథ కాదు. పద్మనాభం మండలం భద్రయ్యపేట అనే చిన్న గ్రామంలోని
బాధితుల వ్యధ. ఏడేళ్లలో 20 మందిని బలిగొని, మరో 50 మందిని మంచాన పడేసిన ఈ కిడ్నీ వ్యాధి ఇప్పుడు
ఆ ఊరిని నిశ్శబ్దంగా మింగేస్తోంది.
డీఎంహెచ్‌వో పర్యటన
డీఎంహెచ్‌వో పి. జగదీశ్వరరావు తన బృందంతో కలిసి బుధవారం భద్రయ్యపేటను సందర్శించారు. బాధితులతో మాట్లాడి వారికి భరోసా కల్పించారు. రేవిడి పీహెచ్‌సీ వైద్యాధికారులు, సిబ్బంది భద్రయ్యపేటలోనే అందుబాటులో ఉండి వైద్యం అందించాలని ఆదేశించారు. నడుము నొప్పి, నీరసం, ఒంటి నొప్పులు వంటి లక్షణాలు ఉన్నవారు వెంటనే ఆరోగ్య కేంద్రానికి సమాచారం ఇవ్వాలని సూచించారు. ఏఎంసీ వైద్య బృందాన్ని గ్రామానికి పంపిస్తామని హామీ ఇచ్చారు. అయితే గ్రామంలో నీరు కలుషితం కాలేదని ఆయన స్పష్టం చేశారు. ఎంపీడీవో ఎం. విజయ్‌కుమార్, కార్యదర్శి నూర్జహాన్, డాక్టర్ బి. ఉమావతి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
పద్మనాభం: మండలం రెడ్డిపల్లి పంచాయతీలోని భద్రయ్యపేట గ్రామస్తులను కిడ్నీ వ్యాధి తీవ్రంగా పట్టిపీడిస్తోంది. గ్రామంలోని మూడు వందల జనాభాలో ఇప్పటికే 50 మంది ఈ వ్యాధి బారిన పడ్డారని ప్రాథమికంగా నిర్ధారణ కావడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. గడిచిన ఏడేళ్లలో సుమారు 20 మంది కిడ్నీ వ్యాధితోనే మృతి చెందడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ క్రమంలో తమకు రక్తపరీక్షలు నిర్వహించాలని గ్రామస్తులు రేవిడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) వైద్యులకు వినతిపత్రం అందించారు. వారి అభ్యర్థన మేరకు పీహెచ్‌సీ వైద్య సిబ్బంది మేలో 138 మంది నుంచి రక్త నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో 50 మంది రక్తంలో క్రియేటినిన్ స్థాయిలు ఉండాల్సిన దాని కంటే ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. వారికి కిడ్నీ వ్యాధి సోకినట్లు మూడు రోజుల కిందట పీహెచ్‌సీ సిబ్బంది నిర్ధారించడంతో గ్రామస్తుల్లో ఆందోళన మరింత పెరిగింది. వీరికి మళ్లీ పరీక్షలు జరిపేందుకు మంగళవారం కొంతమందిని, బుధవారం మరికొంతమందిని కేజీహెచ్‌కు తరలించారు.
ఒకే కుటుంబంపై తీవ్ర ప్రభావం
ఈ వ్యాధి ఆల్తి గోపాల్ కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసింది. ఇప్పటికే ఆయన ఇంట్లో బుచ్చిబాబు, సన్యాసమ్మ, అప్పలనరసమ్మ కిడ్నీ వ్యాధితో మృతి చెందారు. ఆయనతో కలిపి ఆ ఇంట్లో మొత్తం నలుగురు మరణించారు. జూన్‌లోనే అప్పలనరసమ్మ కన్నుమూశారు. మరోవైపు వృద్ధురాలు కొరాడ రాములమ్మతో పాటు ఆమె కుమారులు కృష్ణ (54), శ్రీను (30), కోడలు చినతల్లి (49) కూడా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు.
కారణాలపై అనుమానాలు
గ్రామంలో రక్షిత మంచినీటి పథకం ద్వారా శుద్ధి చేసిన నీరు అందుబాటులో ఉన్నప్పటికీ, ఆ నీటిని రాత్రిపూట పట్టి ఉంచితే తెల్లవారేసరికి సున్నం రంగులోకి మారిపోతోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి సమీపంలో మూడు క్వారీలు ఉన్నాయి. క్వారీల్లో రాయిని పగలగొట్టడానికి ఉపయోగించే పేలుడు పదార్థాల రసాయనాలు విషతుల్యమై, భూగర్భ జలాలను కలుషితం చేస్తున్నాయని గ్రామస్తులు అనుమానిస్తున్నారు.
భద్రయ్యపేటలో ఏడేళ్లలో
20 మంది మృతి
138 మందికి పరీక్షలు చేస్తే
50 మందికి వ్యాధి నిర్ధారణ
ఇందుకు కారణం క్వారీలా?
కలుషిత నీరా?

కిడ్నీ మహమ్మారి

కిడ్నీ మహమ్మారి

కిడ్నీ మహమ్మారి