
కోహినూర్ వజ్రం కథతో ‘వీరమల్లు’
మద్దిలపాలెం: ‘హరి హర వీరమల్లు’ చిత్రం ఆలస్యంగా వచ్చినా ఒక అద్భుతం సృష్టిస్తుందని, ప్రేక్షకుల అంచనాలకు మించి విజయం సాధిస్తుందని ఉప ముఖ్యమంత్రి, చిత్ర కథానాయకుడు పవన్ కల్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. బీచ్‌రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ హాల్‌లో బుధవారం జరిగిన చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన నటన గురువు సత్యానంద్‌ను, సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణిని శాలువాలతో సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తన పేరే పవన్ అని.. తాను అంతా ఉంటానని అన్నారు. విశాఖతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ, తన నటనకు పునాది పడింది ఉత్తరాంధ్రలోనే అని పవన్ అన్నారు. తనకు ఉత్తరాంధ్ర, ఇక్కడి ఆటాపాట చాలా ఇష్టమన్నారు. తనకు నటన నేర్పిన ప్రదేశం విశాఖ అని, అందుకే ఈ నగరంలో ప్రచార కార్యక్రమం ఏర్పాటు చేశామని తెలిపారు. ‘నా సినిమా చూడండి అని అడగడం నాకు మోహమాటం. నాకు ఇవ్వడమే తెలుసు.. తీసుకోవడం రాదు’ అని అన్నారు. తన మొదటి చిత్రం అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్ర షూటింగ్ వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌లో జరిగిందని గుర్తు చేసుకున్నారు. ప్రజా కంటకుడైన ఔరంగజేబు తీసుకెళ్లిపోయిన కోహినూర్ వజ్రాన్ని తీసుకురావడం అనే కథాంశంతో, ఈ చిత్రం ఒక అద్భుతమైన హిస్టారికల్ సోషియో ఫాంటసీగా అలరిస్తుందన్నారు. దర్శకులు క్రిష్, జ్యోతికృష్ణ, హీరోయిన్ నిధి అగర్వాల్, నిర్మాత ఎ.ఎం రత్నంల కృషిని అభినందించారు. కీరవాణి సంగీతం, ముఖ్యంగా కై ్లమాక్స్ సన్నివేశాలకు అందించిన నేపథ్య సంగీతం రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తుందని కొనియాడారు. సినిమా ఎంటర్‌టైన్ చేస్తే చాలని చాలా మంది అనుకుంటారని.. నా సినిమాలు ఎంటర్‌టైన్‌తో పాటు ఎడ్యుకేట్ చేయాలని కోరుకుంటానని తెలిపారు. ఈ సందర్భంగా పవన్ బైబైయ్యే బంగారు రమణమ్మా.. లబో లబో లబరి గాజులు పాటలు పాడి అలరించారు. హీరోయిన్ నిధి అగర్వాల్, సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి, నటులు రఘుబాబు, డ్యానియల్ తదితరులు చిత్ర అనుభవనాలను పంచుకున్నారు. గాయనీగాయకులు చిత్రంలోని పాటలు ఆలపించారు. సన్నీ బృందం చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. జనసేన ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలు పాల్గొన్నారు.
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్