
బాంబు పేలుళ్లు.. గన్ ఫైరింగ్‌లు
విశాఖ సిటీ : ఒక్కసారిగా ఢామ్‌మని బాంబు పేలింది. ఆ శబ్దం ఎక్కడి నుంచి వచ్చిందోనని తేరుకునేలోగా గన్‌ఫైరింగ్ వినిపించింది.. బాంబుల పొగల నుంచి అధునాతన రైఫిల్స్ పట్టుకుని బ్లాక్ కమాండోలు దూకారు. ఒక్కసారిగా ఆ ప్రాంతంలో యుద్ధ వాతావరణం నెలకొంది. అక్కడున్న ప్రజలు, అటువైపుగా వెళుతున్న వాహనదారుల్లో ఏం జరుగుతోందోన్న ఆందోళన మొదలైంది. చివరకు అది కౌంటర్ టెర్రరిస్ట్ విన్యాసాలని తెలుసుకుని అంతా ఊపిరిపీల్చుకున్నారు. నగరంలో పారిశ్రామిక ప్రాంతాల్లో ఈ నెల 21వ తేదీ నుంచి కౌంటర్ టెర్రరిస్ట్ వ్యాయామాన్ని నిర్వహిస్తున్నారు. గత మూడు రోజులుగా విశాఖ పోర్టు, ఇండియన్ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్ లిమిటెడ్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ వంటి కీలకమైన ప్రాంతాల్లో టెర్రరిస్ట్‌ల దాడులను తిప్పికొట్టేలా మాక్ డ్రిల్ చేపట్టారు. ఈ నెల 25వ తేదీ వరకు ఈ డ్రిల్ జరగనుంది. రాష్ట్ర పోలీసులు, అక్టోపస్, అగ్నిమాపక, ఇతర సంబంధిత శాఖల అధికారులు, కేంద్ర బలగాలైన ఎన్‌ఎస్‌జీ బృందం సమన్వయంతో ఉగ్రవాద కార్యకలాపాలను చిత్తు చేసే వ్యూహాలను పదును పెట్టేందుకు ఈ మాక్ డ్రిల్ నిర్వహించారు. ఒకవైపు టెర్రరిస్టులపై విరుచుకుపడుతూనే.. మరోవైపు గాయపడిన తోటి సైనికులకు వైద్య సహకారం అందించేందుకు ఏ విధమైన కార్యచరణ సంసిద్ధం చేయాలన్న దానిపైనా ప్రదర్శన చేశారు. అలాగే ఇందులో ఉద్రవాగుల దాడులను సమర్ధవంతంగా తిప్పికొట్టడంతో పాటు బందీలను రక్షించడం, ఐఈడీ ఆపరేషన్స్ విన్యాసాలు చేశారు.
పారిశ్రామిక నగరంలో యుద్ధ వాతావరణం
పోర్టు, ఐఎస్‌పీఆర్‌ఎల్, బీడీఎల్‌లో మాక్‌డ్రిల్

బాంబు పేలుళ్లు.. గన్ ఫైరింగ్‌లు