
ఫిర్యాదులకు తక్షణ పరిష్కారం చూపండి
జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశం
డాబాగార్డెన్స్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్)లో వస్తున్న ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ అధికారులను ఆదేశించారు. బుధవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయ సమావేశ మందిరంలో అదనపు కమిషనర్ డీవీ రమణమూర్తి, డీసీఆర్ ఎస్.శ్రీనివాసరావుతో కలిసి అన్ని విభాగాల ఉన్నతాధికారులు, జోనల్ కమిషనర్లు, వార్డు అడ్మిన్ కార్యదర్శులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పీజీఆర్‌ఎస్‌లో పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదులను మూడు రోజుల్లో పూర్తి చేయాలని స్పష్టం చేశారు. గత 30 రోజులుగా వార్డు సచివాలయాల వారీగా అడ్మిన్ కార్యదర్శుల లాగిన్‌లలో ఉన్న ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలన్నారు. ఏ విభాగానికి సంబంధించిన ఫిర్యాదునైనా ఆ విభాగాధిపతులు వెంటనే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని ప్రధాన ఇంజనీరు పల్లంరాజు, ప్రధాన వైద్యాధికారి నరేష్ కుమార్, చీఫ్ సిటీ ప్లానర్ ప్రభాకరరావు, యూసీడీ పీడీ సత్యవేణి, డీసీఆర్ శ్రీనివాసరావులను ఆదేశించారు. సచివాలయాల్లో అడ్మిన్ కార్యదర్శులు, ఇతర కార్యదర్శులు క్షేత్రస్థాయికి వెళ్లడం లేదని.. సచివాలయాల్లో కూడా ఉండటం లేదని ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ఫీల్డ్ విజిట్‌కు వెళ్లినప్పుడు మూవ్‌మెంట్ రిజిస్టర్‌లో తప్పనిసరిగా నమోదు చేసి వెళ్లాలని సూచించారు. వార్డు కార్యదర్శులందరూ సచివాలయాల్లో తప్పనిసరిగా మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విధుల్లో నిమగ్నమై.. ప్రజలకు సేవలు అందించాలని కమిషనర్ ఆదేశించారు. అడ్మిన్ కార్యదర్శులు అనుమతి/సెలవుపై వెళ్లాల్సి వస్తే జోనల్ కమిషనర్‌కు తెలియజేయాలన్నారు. సచివాలయాల వారీగా రోజుకు ఒకటి లేదా రెండు ప్రజా వినతులు మాత్రమే వస్తాయని, కార్యదర్శులు క్రమశిక్షణతో పనిచేస్తే అసలు వినతులే పెండింగ్‌లో ఉండవని ఆయన స్పష్టం చేశారు. చాలా మంది ప్లానింగ్ కార్యదర్శులు తమ సంబంధిత విధులను నిర్వహించకుండా ఇతర చోట్ల పని చేస్తున్నారని, అందువల్ల ప్లానింగ్ సమస్యల పరిష్కారానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని జోనల్ కమిషనర్లు తెలపగా.. అటువంటి వారి జాబితాను అందజేయాలని కమిషనర్ ఆదేశించారు. పురమిత్ర యాప్‌ను ప్రతి ఒక్కరూ డౌన్‌లోడ్ చేసుకుని వినియోగించుకోవాలని కమిషనర్ కోరారు. ఈ యాప్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలని సచివాలయ కార్యదర్శులను కమిషనర్ ఆదేశించారు.