
మౌలిక వసతులపై దృష్టిసారించండి
బీచ్‌రోడ్డు: ఎన్టీఆర్ కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలతో పాటు మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ ఆదేశించారు. 2026 మార్చి నాటికి అన్ని ఇళ్లు పూర్తి కావాలని నిర్దేశించారు. రోజువారీ లక్ష్యాలు పెట్టుకొని పనిచేయాలని సూచించారు. బుధవారం హౌసింగ్, స్పెషల్ ఆఫీసర్లు, ఇతర అధికారులతో కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో పలు అంశాలపై లేఅవుట్ వారీగా సమీక్షించారు. నాణ్యత విషయంలో రాజీ లేకుండా ఇళ్ల నిర్మాణాల పనులు చేయించాలని పేర్కొన్నారు. లక్ష్య సాధనలో విఫలమైన అధికారులు, సిబ్బందికీ మూడు దఫాలు మెమోలు, షోకాజ్ నోటీసులు ఇవ్వాలని, అప్పటికీ పురోగతి లేకపోతే సస్పెండ్‌కు రిఫర్ చేయాలని హౌసింగ్ పీడీని ఆదేశించారు. మంజూరైన ప్రతి ఒక్కరితో ఇల్లు కట్టించి తీరాల్సిందేనని.. అప్పటికీ ఇల్లు నిర్మాణానికి ఆసక్తి చూపకపోతే సంబంధిత లబ్ధిదారుల పట్టాను, ఇల్లును రద్దు చేస్తామని చెప్పాలని అధికారులకు సూచించారు. అలాగే విద్యుత్, తాగునీరు, డ్రెయిన్లు, అప్రోచ్ రోడ్లు వంటి మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని వివిధ విభాగాల అధికారులను ఆదేశించారు. పాపాయి సంతపాలెం, విజయపాలెం లేఅవుట్లలో అప్రోచ్ రోడ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న ఇళ్ల వివరాలను తెలుపుతూ నివేదిక పంపించాలని హౌసింగ్ అధికారులను ఆదేశించారు. సమావేశంలో గృహ నిర్మాణ శాఖ పీడీ సత్తిబాబు, ఈఈ శ్రీనివాసరావు, డీఈలు, ఏఈలు, లేఅవుట్ ఇన్‌చార్జి అధికారులు, ప్రత్యేక అధికారులు, వర్చ్వుల్‌గా ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, వార్డు ఎమెనిటీస్ సెక్రటరీలు పాల్గొన్నారు.
ఎన్టీఆర్ కాలనీల్లో ఇళ్ల నిర్మాణాల
పురోగతిపై కలెక్టర్ సమీక్ష