
గడువు దాటిన ఎనర్జీ డ్రింక్స్ పంపిణీ
పట్టించుకోని జీవీఎంసీ, ఫుడ్ సేఫ్టీ అధికారులు
మధురవాడ: గడువు దాటిన తర్వాత ఏ వస్తువునైనా వాడితే అది విషతుల్యంగా మారుతుందన్నది జగమెరిగిన సత్యం. అయినప్పటికీ మధురవాడ, మిథిలాపురి, వుడా కాలనీల పరిసర ప్రాంతాల్లో, ముఖ్యంగా పేదలు అధికంగా నివసించే చోట ప్రముఖ సంస్థకు చెందిన ఎనర్జీ డ్రింక్స్‌ను ఆటోల ద్వారా ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఈ డ్రింక్స్‌కు గడువు తేదీ ఒకటి లేదా రెండు రోజులు మాత్రమే మిగిలి ఉండటం, కొన్ని గడువు దాటిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ డ్రింక్స్ విషపూరితమని తెలియని పేద ప్రజలు, చిన్నా పెద్దా తేడా లేకుండా, ఎగబడి వీటిని తీసుకుని ఇళ్లల్లో నిల్వ చేసుకుంటున్నారు. కొందరు వాటిని వెంటనే తాగుతున్నారు. ఈ పరిస్థితిని గమనించిన డాక్టర్ ఆదిత్య మాట్లాడుతూ గడువు దాటిన తర్వాత ఈ డ్రింక్స్‌ను వాడితే ఆరోగ్యానికి ప్రమాదమని హెచ్చరించారు. అంతేకాకుండా వీటిలో కెఫీన్ ఉండటం వల్ల గుండె సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉందని, ముఖ్యంగా పిల్లలకు ఇది మరింత హానికరమన్నారు. ఇటువంటి సంఘటనలు నిత్యం అనేక ప్రాంతాల్లో జరుగుతున్నప్పటికీ.. వీటిని నియంత్రించాల్సిన జీవీఎంసీ, ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. దీనిపై మధురవాడ జోన్ ఫుడ్ సేఫ్టీ అధికారి ఆనందరావును వివరణ కోరగా.. ఇలాంటి డ్రింక్స్‌ను పంచుతున్న విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. ఆటో, పంపిణీ చేస్తున్న వ్యక్తుల వివరాల కోసం విచారణ జరుపుతున్నామని తెలిపారు.