
మధురవాడ/ఆరిలోవ: త్వరలో ఆర్డీవో అవుతానన్నావు.. మరింత మందికి సేవ చేస్తానన్నావు.. పిల్లలను బాగా చదివించాలని ఆశప డ్డావు.. మా అందరికీ పెద్ద దిక్కుగా నిలిచావు.. ఇంతలోనే అందనిలోకాలకు చేరు కున్నావా.. రమణయ్యా అంటూ.. తహసీల్దార్ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ.. సరదాగా, స్నేహభావంతో ఉండేవాడని.. ఇప్పుడు తమకు దూరమయ్యాడంటూ గుండెలవిసేలా రోదించారు. పిల్లలు రమణయ్య ఫొటో చూసి డాడీ.. డాడీ అంటూ ఏడ్చిన తీరు చూపరులను కలచివేసింది. ఆయనతో పనిచేసిన సిబ్బంది అయితే కన్నీరు పెట్టుకున్నారు. రమణయ్య క్రమశిక్షణ గల అధికారిగా మంచి పేరు ఉందని, ఇటీవల గణతంత్ర దినోత్సవం నాడు ఉత్తమ సేవా పురస్కారం అందుకున్నారని వారు తెలిపారు.
ఉలిక్కిపడిన కొమ్మాది ప్రాంతం
విశాఖ రూరల్ తహసీల్దార్‌గా పనిచేసిన సనపల రమణయ్య.. తల్లి శకుంతలమ్మ, భార్య అనూష, పాప చాన్విష (7), బాబు రియంత్(3)తో కలిసి కొమ్మాది ప్రాంతంలో చరణ్ కేజిల్ అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్నారు. ఎన్నికల నేపథ్యంలో రెండు రోజుల కిందట ఆయనకు విజయనగరం జిల్లా బొండపల్లికి బదిలీ అయింది. శుక్రవారం ఉదయం అక్కడకు వెళ్లి బాధ్యతలు స్వీకరించారు. తిరిగి సాయంత్రం కొమ్మాదిలో తన నివాసానికి వచ్చారు. రాత్రి 10 గంటల సమయంలో అపార్ట్‌మెంట్ సెల్లార్‌లో రమణయ్యపై ఓ వ్యక్తి ఇనుపరాడ్డుతో దాడి చేశాడు. తలపై 12 సార్లు కొట్టడంతో వెంటనే ఆయన కుప్పకూలిపోయాడు. వెంటనే కుటుంబ సభ్యులు అపోలో ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. రమణయ్య హత్యతో కొమ్మాది ప్రాంతం ఉలిక్కి పడింది. చాలా ప్రశాంతంగా ఉండే ఈ ప్రాంతంలో ప్రభుత్వ అధికారి హత్య ఉదంతంలో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. కాగా రమణయ్య స్వగ్రామం శ్రీకాకుళం జిల్లా నందిగామ మండలం దిమిలాడ.
సిబ్బంది దిగ్భ్రాంతి : రూరల్ తహసీల్దార్ కార్యాలయంలో రెండు రోజుల కిందట వరకు తహసీల్దార్‌గా పనిచేసిన రమణయ్య హత్యకు గురవడం.. సిబ్బందిలో కలవరం రేపింది. శనివారం ఉదయం ఆయన హత్య వార్త విన్న ఇక్కడ పనిచేస్తున్న సిబ్బంది దిగ్భ్రాంతికి గురయ్యారు. రమణయ్య 2023 ఫిబ్రవరి 10న కలెక్టరేట్ సి–సెక్షన్ నుంచి ఇక్కడకు బదిలీపై వచ్చి బాధ్యతలు చేపట్టారు. సాధారణ ఎన్నికల విధానంలో భాగంగా ఆయనకు రెండు రోజుల కిందట విజయనగరం జిల్లా బొండపల్లికి బదిలీ జరిగింది. కాగా 15 ఏళ్ల కిందట ఇక్కడ కార్యాలయంలో సర్వేయర్‌గా పనిచేసిన డి.గోపాలరావు మధురవాడ ప్రాంతంలో ఓ స్థలం సర్వేకి వెళ్లి హత్యకు గురయ్యాడు.
బోసిపోయిన తహసీల్దార్ కార్యాలయం
రూరల్ తహశీల్దార్ కార్యాలయం శనివారం బోసిపోయింది. రెండు రోజుల కిందట వరకు ఇక్కడ పనిచేసిన తహసీల్దార్ రమణయ్య హత్యకు గురికావడంతో సిబ్బంది విచారవదనంలో మునిగిపోయారు. అధికారి హోదాలో ఉన్నప్పటికీ తమతో సరదాగా, స్నేహభావంతో ఉండేవారని కన్నీరు పెట్టుకున్నారు. సిబ్బందిలో కొందరు కేజీహెచ్ మార్చురీ వద్దకు వెళ్లారు. ఇంకొందరు ఆయన స్వగ్రామానికి మృతదేహంతో పాటు వెళ్లి నివాళులర్పించారు. విషయం తెలుసుకున్న సామాన్యులు సైతం రెవెన్యూ పనుల కోసం కార్యాలయానికి వెళ్లకుండానే వెనుదిరిగారు.
రమణయ్య కుటుంబానికి రూ.లక్ష చెక్కు అందజేత
మహారాణిపేట: కేజీహెచ్ మార్చురీ వద్ద రమణయ్య కుటుంబ సభ్యులను పలువురు ప్రముఖులు పరామర్శించారు. కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున, జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్, జీవీఎంసీ అడిషినల్ కమిషనర్ కె.ఎస్.విశ్వనాథన్, డీఆర్‌వో కె.మోహన్‌కుమార్, ఆర్‌డీవోలు డి.హూస్సేన్ సాహెబ్, భాస్కరరెడ్డి తదితరులు రమణయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. లక్ష రూపాయల చెక్కును రమణయ్య కుటుంబానికి కలెక్టర్ అందజేశారు.