యాచారం: మొండిగౌరెల్లిలో అసైన్డ్ భూములు కోల్పోనున్న రైతులకు రూ.200 కోట్లకు పైగా పరిహారం అందనుంది. గ్రామంలోని 19, 68, 127 సర్వేనంబర్లలో 498 మంది రైతులకు చెందిన 677 ఎకరాల అసైన్డ్ భూమిని పారిశ్రామిక పార్క్‌ల కోసం సేకరించడానికి సర్కార్ నిర్ణయించింది. ఎకరాకు రూ.30 లక్షల పరిహారంతో పాటు అభివృద్ధి చేసిన వెంచర్లో 121 గజాల ప్లాటును ఇవ్వనుంది. మొదటి విడతగా రెండు రోజుల క్రితం ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి చేతుల మీదుగా 19 మంది రైతులకు రూ.8.7 కోట్ల పరిహారం చెక్కులు పంపిణీ చేశారు. సోమవారం (నేడు) ఆర్డీఓ కార్యాలయంలో మరో 20 మందికి పైగా రూ.7 కోట్లకు పైగా అందించేందుకు అధికారులు చెక్కులు సిద్ధం చేశారు. మూడో విడత కింద ఈ నెల 4న పెద్ద సంఖ్యలో పరిహారం అందజేయనున్నారు. విడతల వారీగా పక్షం రోజుల్లో అందరికీ పరిహారం అందిస్తామని ఆర్డీఓ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.
ఆ భూములకు ప్రాధాన్యం
మొండిగౌరెల్లిలోని అసైన్డ్ భూమిని రైతుల పట్టాదారు, పాసుపుస్తకాల ప్రకారం కబ్జా సర్వే చేశారు. మొదటిసారి చేసిన సర్వేలో పొరపాట్లు జరిగాయంటూ బాధిత రైతుల నుంచి నిరసన వెల్లువెత్తడంతో రీ సర్వే నిర్వహించారు. మొత్తం 677 ఎకరాల అసైన్డ్ భూమిలో ఏ వివాదం లేకుండా 432 ఎకరాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ భూములకు మొదటి ప్రాధాన్యం కింద పరిహారం అందజేస్తున్నారు. దాదాపు 245 ఎకరాల భూమిపై పరస్పర ఫిర్యాదులు, అక్రమణలు, నకిలీ సర్టిఫికెట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటికి సంబంధించి వందకు పైగా ఫిర్యాదులు, అభ్యంతరాలు అందాయి. నకిలీ సర్టిఫికెట్లు, నకిలీల రైతుల పేర్లను తొలగించి, కుటుంబ పరంగా వివాదంలో ఉన్న భూములను ఇరువర్గాల మధ్య సయోధ్య కుదిరితేనే పరిహారం అందజేయాలని నిర్ణయించారు. ఈజాబితాలోని రైతులకు ఇప్పటికే సమాచారం ఇచ్చారు.
ఊపందుకోనున్న క్రయవిక్రయాలు
నిర్వాసితులకు రూ.200 కోట్ల మేర పరిహారం అందనున్న నేపథ్యంలో ఇక్కడ భూముల క్రయవిక్రయాలు ఊపందుకుంటాయని భావిస్తున్నారు. గ్రామంలో అధిక శాతం మంది రైతులు కూరగాయలు, ఆకుకూరలతో పాటు పాడిపరిశ్రమతో ఉపాధి పొందుతున్నవారే. వచ్చిన డబ్బులతో సమీప గ్రామాల్లో భూములు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈక్రమంలో యాచారంతో పాటు నల్గొండ జిల్లా మర్రిగూడ, చింతపల్లి, దేవరకొండ, పెద్దవురా, రంగారెడ్డి జిల్లాలోని మాడ్గుల, కడ్తాల్, తలకొండపల్లి ఆమనగల్లు తదితర ప్రాంతాల్లో వ్యవసాయ భూములు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే, గ్రామం నుంచి 50 కిలోమీటర్ల దూరం వెళ్లినా ఎకరాకు రూ.30 లక్షలకు పైగానే ఉండటంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. సారవంతమైన భూములు వదులుకుని సుదూర ప్రాంతాలకు వెళ్లి భూములు కొనుగోలు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. మరికొంత మంది ప్లాట్లు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.
మొండిగౌరెల్లి భూములకు విడతల వారీగా పరిహారం
పక్షం రోజుల్లో అందరికీ చెక్కులు అందజేయాలని ప్రభుత్వ నిర్ణయం
వ్యవసాయ భూములు, ప్లాట్ల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్న రైతులు


