● ప్రారంభించిన చినజీయర్‌స్వామి
శంషాబాద్ రూరల్: శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతత, సమానత్వం అందరి జీవితంలో భాగం కావాలని త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్‌స్వామి ఆకాంక్షించారు. శంషాబాద్ మండలం ముచ్చింతల్ శివారులోని సమతా స్ఫూర్తి కేంద్రం వద్ద ఆదివారం ‘ఈక్వాలిటీ రన్– 2026’ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా చినజీయర్ మాట్లాడుతూ.. శ్రీ భగవద్రామానుజుల సమతా దృక్పథాన్ని, సమాజంలో సోదర భావాన్ని విస్తరింపజేయడానికి ఇలాంటి క్రీడా కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. శాంతి భద్రతల పర్యవేక్షణతో పాటు ప్రజల్లో సామాజిక బాధ్యత, శారీరక దృఢత్వం ఉండేలా ప్రోత్సహించేందుకు పోలీస్ శాఖ ఎప్పుడూ ముందుంటుందని ఫ్యూచర్‌సిటీ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి చెప్పారు. కాగా.. చినజీయర్‌స్వామి.. పరుగు పోటీలో పాల్గొని అందరిలో జోష్ నింపారు. కార్యక్రమంలో వేద పాఠశాల, నేత్ర విద్యాలయం విద్యార్థులతో పాటు స్థానిక యువత, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


