ధారూరు: ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న దృష్యా రైతులు వరి సాగు తగ్గించి సేంద్రియం మొగ్గు చూపాలని జిల్లా వ్యవసాయాధికారి కవిత సూచించారు. గురువారం ధారూరు రైతు వేదికలో ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులు విధిగా భూసార పరీక్షలు చేయించాలన్నారు. పంట మార్పిడితో అధిక దిగుబడి పొందవచ్చని తెలిపారు. నీటిని కాపాడుకోవడం ద్వారా ఎల్‌నినో ప్రభావాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలని సూచించారు. ప్రతి రైతూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని తెలిపారు. పొలాల్లో ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలన్నారు. పంట ఉత్పత్తులను దళారులకు కాకుండా వ్యవసాయ మార్కెట్లలో విక్రయించి లబ్ధి పొందాలని తెలిపారు. అనంతరం ఏఎంసీ చైర్మన్ విజయభాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ.. తక్కువ నీటితో సాగయ్యే పంటలను వేయాలని రైతులకు సూచించారు. వరి పంటను పూర్తిగా తగ్గిస్తే మంచిదన్నారు. అనంతరం ఉద్యాన శాఖ జిల్లా అధికారి సత్తార్ మాట్లాడుతూ.. వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు వేయాలన్నారు. అంతకుముందు స్పెషల్ రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు రైతులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో జిల్లా మార్కెంగ్ అధికారి స్వరన్‌సింగ్, డీపీఓ రవీందర్, ఏడీఏ వెంకటేశం, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు పీ రాములు, ఏఎంసీ కార్యదర్శి సిద్దమ్మ, ఏఓ సూర్యప్రకాశ్, ఉద్యాన శాఖ అధికారి యమున, సర్పంచులు ప్రమీలగౌడ్, అనంతయ్య తదితరులు పాల్గొన్నారు.
వరి సాగు తగ్గించి సేంద్రియం వైపు మొగ్గు చూపాలి
జిల్లా వ్యవసాయాధికారి కవిత


