క్షేత్రస్థాయిలో పరిశీలించకుండానే.. ఒక్క సరూర్‌నగర్‌లోనే 394 ఎకరాలు క్రయవిక్రయాలకు తప్పని పాట్లు అత్యవసర పరిస్థితుల్లో అమ్ముకోలేని స్థితి లబోదిబోమంటున్న బాధితులు
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ప్రభుత్వ ఆస్తులకు రక్షణ కల్పించాల్సిన 22–ఏ.. విలువైన ప్రైవేటు ఆస్తులకు తాళాలు బిగిస్తోంది. తర్వాత పెద్ద ఎత్తున పైరవీలకు తెరతీస్తోంది. అడిగినంత ముట్టజెప్పిన వారి ఆస్తులకు బిగించిన తాళాలను తొలగించడం, లేదంటే సమస్యను మరింత క్లిష్టంగా మార్చుతోంది. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం.. అధికారుల నిర్లక్ష్యం వెరసి.. భూ బాధితులకు శాపంగా మారింది. క్షేత్రస్థాయిలోని భూములను పరిశీలించకుండా, కేవలం ఆఫీసుల్లోని రికార్డుల ఆధారంగా ప్రైవేటు ఆస్తులను సైతం నిషేధిత జాబితాలో చేర్చుతుండడంపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
30 వేల ఆస్తులకు తాళాలు
జిల్లాలోని శేరిలింగంపల్లి, గండిపేట, రాజేంద్రనగర్, సరూర్‌నగర్, బాలాపూర్, హయత్‌నగర్ మండలాల్లో మూడు వేల ఎకరాలకుపైగా భూములను యూఎల్‌సీ పేరుతో నిషేధిత జాబితతాాలో చేర్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఒక్కో ఎకరంలో సగటున 30 ఇళ్లు/ఖాళీ(150 నుంచి 200 గజాల) ప్లాట్ల చొప్పున లెక్కించినా 30 వేలకుపైగా ప్రైవేటు ఆస్తులను నిషేధిత జాబితాలోకి చేర్చినట్లు స్పష్టమవుతోంది. అత్యవసర పరిస్థితుల్లో ఆస్తులను అమ్ముకోలేక, రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో బ్యాంకుల నుంచి లోన్లు రాక, పిల్లల పెళ్లిళ్లు సహా గృహ ప్రవేశాలు నిలిచిపోతున్నాయి. ప్రభుత్వ ఆస్తులు కళ్లముందే కబ్జాకు గురవుతున్నా పట్టించుకోని రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అధికారులు పైసాపైసా కూడబెట్టి ప్రజలు కొనుగోలు చేసుకున్న ప్రైవేటు ఆస్తులను చెప్పాపెట్టకుండా నిషేధిత జాబితాలో చేర్చడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.
ఆంతర్యం ఏమిటో..
సరూర్‌నగర్ మండల పరిధిలోని గడ్డిఅన్నారం, లింగోజిగూడ, మన్సూరాబాద్, కర్మన్‌ఘాట్, చంపాపేట్, రోషన్‌దౌల తదితర ప్రాంతాల్లో 394 ఎకరాల ప్రజల ఆస్తులను 22–ఎ జాబితాలో చేర్చారు. వీటిలో సర్వే నంబర్ 126, 127, 128లలోని లక్ష్మీనగర్ 5 ఎకరాల హెచ్‌ఎండీఏ వెంచర్ సైతం ఉండడం విశేషం. ఇప్పటికే 80 శాతం నివాసాలు పూర్తయిన రోషన్‌దౌల సర్వే నంబర్ 39 కూడా ఉంది. నిషేధిత జాబితాలోకి ఇటీవలే ఈ సర్వే నంబర్లు వ చ్చి చేరడం వెనుక ఆంతర్యం ఏమిటో అర్థం కావ డం లేదు. ఏళ్ల క్రితమే రిజిస్ట్రేషన్లు పూర్తి చేసుకుని, మున్సిపాలిటీల నుంచి అనుమతులు పొంది, ఆస్తి పన్ను చెల్లిస్తున్న నిర్మాణాలను, వాటి పక్కనే ఖాళీ గా ఉన్నస్థలాలను నిషేధిత జాబితాలో చేర్చడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కోర్టు ఆదేశాలు బేఖాతర్
ప్రైవేటు ఆస్తులను నిషేధిత జాబితాలో చేర్చడంపై కొంత మంది కోర్టును ఆశ్రయించారు. ఆర్డర్లు కూ డా తీసుకొచ్చారు. అయినా రెవెన్యూ, సబ్‌రిజిస్ట్రార్ అధికారులు వాటిని బేఖాతర్ చేస్తున్నారు. అవసరమైతే కంటెంప్ట్‌కు వెళ్తామని బాధితులను బెదిరిస్తున్నారు. రోజుల తరబడి ఆఫీసుల చుట్టూ తిప్పుకొంటున్నారు. చివరికి అడిగినంత ముట్ట జెప్పిన వారి ఆస్తులను రిజిస్ట్రేషన్లు చేస్తూ, నిరాకరించిన వారి కుటుంబాలను రోడ్డున పడేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు.
22 –ఏ జాబితాలోకిప్రజల ఆస్తులు
బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న మహ్మద్ అర్బజ్ సరూర్‌నగర్ మండలం కర్మన్‌ఘాట్ 126,127,129,130,131,132 సర్వే నంబర్లలోని హుడా లే అవుట్‌లో 127 గజాల విస్తీర్ణంలోని ప్లాట్ నంబర్ 60 కొనుగోలు చేశాడు. విక్రయదారుడికి పూర్తి డబ్బులు చెల్లించి రిజిస్ట్రేషన్‌కు వెళ్లగా తీరా ప్లాట్ నిషేధిత జాబితాలో ఉన్నట్లు చూపించారు. దీంతో కొనుగోోలుదారుతో పాటు విక్రయదారు సైతం లబోదిబోమంటున్నారు.
ఏపీకి చెందిన ఓ చిరుద్యోగి సరూర్‌నగర్ మండలం రోషన్‌దౌలా సర్వే నంబర్ 39లో 395 గజాల స్థలాన్ని ఏళ్ల క్రితమే కొనుగోలు చేశాడు. కూతురు వివాహం నిశ్చయం కావడంతో ఖర్చుల కోసం తాజాగా ప్లాట్‌ను అమ్మకానికి పెట్టాడు. అడ్వాన్స్ తీసుకుని, రిజిస్ట్రేషన్‌కు వెళ్లిన సమయంలో ప్లాటు నిషేధిత జాబితాలో ఉన్నట్లు తెలిసి ఆశ్చర్యపోయారు. కోర్టును ఆశ్రయించి, అనుకూలంగా ఆర్డర్ కూడా తీసుకొచ్చారు. అయినా రిజిస్ట్రేషన్‌కు నిరాకరిస్తున్నారు.


