డిజిటలైజేషన్ ప్రక్రియను పూర్తి చేయాలి
● కంది, మక్క, చిరుధాన్యాల సాగు మేలు
● కలెక్టర్ దీపక్ తివారి
అనంతగిరి: తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో నీటి ఎద్దడిని తట్టుకునే పంటలు సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ దీపక్ తివారి అధికారులకు సూచించారు. గురువారం నగరం నుంచి మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు అన్ని జిల్లాల కలెక్టర్లు, వ్యవసాయ, నీటిపారుదల శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో సాగు చేయాల్సిన పంటలపై సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్ జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. నీటి ఆధారిత పంటలు కాకుండా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని రైతులకు సూచించారు. వర్షాలపై ఆధారపడి పంటలు వేస్తే నష్టపోతారనే విషయాన్ని రైతులు తెలియజేయాలన్నారు. రిజర్వాయర్లలో నీటి సామర్థ్యం తక్కువగా ఉన్నందున ఆయకట్టు రైతులు వరి స్థానంలో కంది, మక్క, చిరుధాన్యాల పంటల సాగును ప్రోత్సహించాలని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా వ్యవసాయాధికారి కవిత, ఇరిగేషన్ డీఈ మంజుల తదితరులు పాల్గొన్నారు.
ఆదర్శ జీపీలుగా తీర్చిదిద్దాలి
గ్రామాలను ఆదర్శ పంచాయతీలుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత సర్పంచులు, కార్యదర్శులపై ఉందని కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జీపీల సమగ్ర అభివృద్ధిపై ఎంపీడీఓ, ఎంపీఓ, ఏపీఓ, సర్పంచ్, పంచాయతీ కార్యదర్శుకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పక్కా ప్రణాళికతో సాగితే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. గ్రామాల పూర్తి సమాచారాన్ని ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉంటుందన్నారు. గ్రామాల్లో కుక్కల బెడద ఎక్కువగా ఉన్నందున జంతు జనన నియంత కేంద్రాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. జలసిరి పథకం ద్వారా ప్రతి ఇంటికీ ఇంకుడు గుంత, ప్రతి పొలానికి పంట కుంట, ప్రతి ఊరిలో ఊట కుంట ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, జెడ్పీ సీఈఓ సుధీర్, డీపీఓ జయసుధ, డీఆర్‌డీఓ శ్రీనివాస్, అడిషనల్ డీఆర్‌డీఓ సత్తయ్య, మిషన్ భగీరథ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రవికుమార్, పంచాయతీ రాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
కారుణ్య నియామక పత్రాల అందజేత
జిల్లాలో కారుణ్య నియామకాలు చేపట్టడం జరిగిందని కలెక్టర్ దీపక్ తివారి తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లో ఖాళీగా ఉన్న శాఖల్లో అర్హులైన వారికి నియామక పత్రాలు అందజేశారు. రెవెన్యూ, మున్సిపల్, మిషన్ భగీరథ శాఖలో అభ్యర్థులను నియమించినట్లు తెలిపారు.
ఈ నెల 20లోపు సర్ డిజిటలైజేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని కలెక్టర్ దీపక్ తివారి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో ఈఆర్‌ఓ, ఏఈఆర్‌ఓ, బీఎల్‌ఓ సూపర్ వైజర్లతో గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో 10,17,671 మంది ఓటర్లకు గాను 1,20,775 మంది ఓటర్ల డిజిటలైజేషన్ ప్రక్రియను పూర్తి చేయడం జరిగిందన్నారు. వంద శాతం పూర్తి చేసేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. సమీక్షలో అదనపు కలెక్టర్వెంకటాచారి, డీఆర్‌ఓ స్వర్ణలత, డీఆర్‌డీఓ శ్రీనివాస్, బీడబ్ల్యూఓ కాంతారావు, హెచ్ సెక్షన్ సూపరింటెండెంట్ నెమత్ అలీ, వికారాబాద్, కొడంగల్ తహసీల్దార్లు బీ లక్ష్మీనారాయణ, పీ రాంబాబు, ఎన్నికల విభాగం సిబ్బంది పాల్గొన్నారు.


