పాస్‌ పోర్ట్‌ గగనమే! | - | Sakshi
Sakshi News home page

పాస్‌ పోర్ట్‌ గగనమే!

Jul 10 2026 9:45 AM | Updated on Jul 10 2026 9:45 AM

వికారాబాద్‌: పాస్‌పోర్ట్‌ కార్యాలయం ఏర్పాటై ఐదేళ్లు కావస్తున్నా సేవలు మాత్రం అంతంతగానే ఉన్నాయి. కేవలం ఇద్దరు ఉద్యోగులతో నెట్టుకొస్తున్నారు. పోస్టల్‌ శాఖ పాస్‌ పోర్ట్‌ కార్యాలయ సేవలను విస్తరించడం లేదు. కొత్త జిల్లాలు ఏర్పాటైన సమయంలో వికారాబాద్‌లో కార్యాలయాన్ని ప్రారంభించారు. ఒకే గదిలో రెండు బల్లలు అడ్డంగా పెట్టి పోస్టాఫీసు, పాస్‌ పోర్టు కార్యాలయాలను నిర్వహిస్తున్నారు. ఇద్దరు ఉద్యోగులు ఉండగా ఒక్కొక్కరికి రోజుకు 40 స్టాట్లు కేటాయిస్తున్నారు. సెలవు రోజు మినహా రోజుకు 80 స్లాట్లు బుక్‌ చేసుకోవడానికి వీలుంది. బుక్‌ చేసుకున్న తర్వాత 15 నుంచి 20 రోజుల తర్వాత తేదీలు కేటాయిస్తున్నారు. ఒక్కోసారి నెలలు వేచి ఉండాల్సి వస్తోంది. పక్క జిల్లాలైన సంగారెడ్డి, హైదరాబాద్‌ శివారు ప్రాంతాల ప్రజలు కూడా పాస్‌పోర్ట్‌ కోసం ఇక్కడికే వస్తుంటారు. సిబ్బంది కొరత కారణంగా సకాలంలో పార్ట్‌పోర్టులు అందడం లేదు.

వెరిఫికేషన్‌ ఆఫీసర్‌ లేక..

కార్యాలయాన్ని ప్రారంభించిన నాటి నుంచి వెరిఫికేషన్‌ ఆఫీసర్‌ను నియమించలేదు. చిన్న చిన్న పొరపాట్లు, అక్షరాలు తప్పుగా పడటం లాంటి సమస్యల పరిష్కారం కోసం సికింద్రాబాద్‌లోని ప్రధాన కార్యాలయానికి పరుగులు తీయాల్సి వస్తోంది. అక్కడ కూడా రద్దీ ఉండటంతో రోజుల తరబడి తిరగాల్సి వస్తోంది. వికారాబాద్‌ కార్యాలయంలో వెరిఫికేషన్‌ అధికారి అందుబాటులో ఉంటే ఇక్కడే సమస్యలు పరిష్కరించుకునేందుకు వీలుంటుంది. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

అవగాహన లేక ఇబ్బందులు

పాస్‌పోర్టు కావాల్సిన వారు నెట్‌ సెంటర్లలో స్లాట్‌ బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఖరారైన తేదీల్లో కార్యాలయానికి వెళ్లి దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. చాలా మందికి అవగాహన లేకపోవడంతో సరైన పత్రాలు పొందు పర్చడం లేదు.. తప్పులు నమోదు చేస్తున్నారు. దీంతో అప్లికేషన్లు తిరస్కరణకు గురవుతున్నాయి. రోజు ఐదారు దరఖాస్తులు రిజెక్టు అవుతుండటం గమనార్హం. స్లాట్‌ సమయం ముగిశాక 15 నిమిషాల నుంచి 30 నిమిషాలు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అరగంట దాటితే స్లాట్‌ రద్దవుతుంది. దీంతో మరోసారి బుక్‌ చేసుకోని రావాల్సి వస్తోందని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికై నా జిల్లా అధికారులు పాస్‌పోర్ట్‌ ఆఫీసులో సిబ్బంది సంఖ్యను పెంచి సకాలంలో పాస్‌పోర్టులు అందేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

ఐదేళ్ల క్రితం

కార్యాలయం ప్రారంభం

ఇద్దరు ఉద్యోగులతో నెట్టుకొస్తున్న వైనం

దరఖాస్తు చేసుకునేందుకు ప్రజల పాట్లు

తిరస్కరణకు గురవుతున్న అప్లికేషన్లు

విధిలేక నగరానికి పరుగులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement