కూతురి మరణానికి అల్లుడే కారణం | - | Sakshi
Sakshi News home page

కూతురి మరణానికి అల్లుడే కారణం

May 11 2026 9:49 AM | Updated on May 11 2026 9:49 AM

నిర్లక్ష్యంగా ఆటో నడపడంతోనే ప్రమాదం

పోలీస్టేషన్‌లో మామ ఫిర్యాదు, కేసు నమోదు

తాండూరు రూరల్‌: అతివేగంగా, నిర్లక్ష్యంగా ఆటో నడపడంతోనే తన కుమార్తె మృతి చెందిందని ఓ మామ అల్లుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ సంఘటన పెద్దేముల్‌ మండలంలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ ప్రశాంత్‌వర్ధన్‌ కథనం ప్రకారం.. మన్‌సాన్‌పల్లికి చెందిన అంగోత్‌ నందిని(23)కి మూడేళ్ల క్రితం చౌడాపూర్‌ మండలం చిన్న మేఘ్యా నాయక్‌ తండాకు చెందిన మెగావత్‌ సురేష్‌తో వివాహం జరిగింది. వీరికి ఓ కుమారుడు ఉన్నారు. సురేష్‌ హైదరాబాద్‌లో ఆటో నడుపుకొంటూ జీవనం సాగిస్తున్నాడు. నందిని తన తల్లి గారి ఇంట్లో శుభకార్యం ఉండటంతో భర్త, కుమారుడితో కలిసి శుక్రవారం మన్‌సాన్‌పల్లికి వచ్చింది. శనివారం దంపతులు ఇంటి సామగ్రి కొనుగోలు చేసేందుకు ఆటోలో తాండూరుకు బయలుదేరారు. ఈ క్రమంలో చైతన్య నగర్‌ గేటు వద్ద ఆటో బోల్తా పడింది. నందిని తలకు తీవ్రగాయం కాగా సురేష్‌ కు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు వీరిని తాండూరులోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం నందిని వికారాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడే చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. ఆదివారం మామ నారాయణ ఫిర్యాదు చేయడంతో అల్లుడు సురేష్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement