యాచారం: ఫార్మా ప్లాట్ల రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల పంపిణీ మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పరిహారం చెల్లింపు విషయమై ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి మధ్య చోటుచేసుకున్న సవాల్, ప్రతిసవాళ్లతో కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఫార్మాసిటీ భూసేకరణ పరిహారం చెల్లింపు విషయంలో గతంలో జరిగిన అక్రమాలను పూర్తిగా తవ్వి తీయాలని కాంగ్రెస్ పట్టుదలగా ఉంది. అసలైన రైతులకు పరిహారంతో పాటు ప్లాట్లు ఇస్తే పర్వాలేదు కానీ రూ.కోట్లలో అక్రమంగా పరిహారం పొందినవారే తిరిగి ప్రభుత్వంపై నిందలు వేయడంపై అధికార పార్టీ గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. గత బీఆర్‌ఎస్ సర్కార్ హయాంలో ఫార్మాసిటీకి 19,333 ఎకరాల అసైన్డ్, పట్టా భూములను సేకరించారు. ఇందులో సింహభాగం మండలంలోని నక్కర్తమేడిపల్లి, నానక్‌నగర్, తాడిపర్తి, కుర్మిద్దలోనే పది వేల ఎకరాల వరకు తీసుకున్నారు. పైనాలుగు గ్రామాల్లో దాదాపు 3,500 మందికిపైగా రైతులు పరిహారం పొందినట్లు తెలుస్తోంది.
ఛాలెంజ్‌గా తీసుకున్న సర్కార్
సుమారు 500 ఎకరాలకు సంబంధించిన కోట్లాది రూపాయల పరిహారం పక్కదారి పట్టిందని ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. కొద్ది రోజుల క్రితం ఆయా గ్రామాల్లోని రాజకీయ పక్షాల నాయకులు అనర్హుల వివరాలతో కూడిన జాబితాను ఉన్నతాధికారులకు అందజేసినట్లు తెలిసింది. దీంతో సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం పూర్తి అక్రమాలను వెలుగులోకి తేవాలనే పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. నక్కర్తమేడిపల్లిలో 250 ఎకరాలు, నానక్‌నగర్‌లో 150 ఎకరాలు, తాడిపర్తిలో 80 ఎకరాలు, కుర్మిద్దలో 150 ఎకరాలకుపైగా పరిహారాన్ని అనర్హులు తీసుకున్నారని ఆయా గ్రామాల నాయకులు కాంగ్రెస్ నేతలు, అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ జాబితాలో తాజా, మాజీ ప్రజాప్రతినిధులు ఉన్నారనే ఆరోపణలున్నాయి.
మళ్లీ జాబితాలు..
ప్రభుత్వం నుంచి గతంలోనే పరిహారం పొంది, ప్రస్తుతం ప్లాట్ల రిజిస్ట్రేషన్లు చేయించుకున్న రైతులతో కూడిన జాబితాను మళ్లీ ప్రకటించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. తాజాగా నక్కర్తమేడిపల్లి జీపీ వద్ద రైతుల జాబితాను ప్రకటించారు. దీనిపై అభ్యంతరాలుంటే ఫిర్యాదు సూచించారు. ఫార్మాసిటీకి భూములిచ్చిన వారిలో నక్కర్తమేడిపల్లి నుంచి 1,281 మంది, కుర్మిద్దలో 574, తాడిపర్తిలో 380, నానక్‌నగర్‌లో 201 మంది రైతులు ప్లాట్లు పొందారు. వీరికి రిజిస్ట్రేషన్లు కూడా పూర్తయ్యాయి. అయితే, పరిహారం అందజేతలో నకిలీలకు సహకరించిన యంత్రాంగం.. రిజిస్ట్రేషన్ల విషయంలోనూ అలాగే వ్యవహరిస్తోందనే ఆరోపణలున్నాయి. వీరిపై ప్రభుత్వం చర్యలకు సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈనేపథ్యంలో పారదర్శకమైన జాబితా తయారీకి మరింత సమయం పట్టే అవకాశం ఉన్నందున డాక్యుమెంట్ల పంపిణీ ఇప్పట్లో కష్టమేననే చర్చ సాగుతోంది.
డాక్యుమెంట్ల పంపిణీకి ఆలస్యమయ్యే అవకాశం
జాబితాలో అనర్హులున్నారని అధికారులకు ఫిర్యాదులు
నకిలీల ఏరివేతనుసీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే..
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే నక్కర్తమేడిపల్లిలో రై తుల జాబితాను ప్రకటించాం. ఇందులో నకిలీ పేర్లు ఉంటే ఫిర్యాదు చేయాలని గ్రామస్తులకు సూచించాం. వీటిని ఉన్నతాధికారులకు చేరవేస్తున్నాం. కొంత ఆ లస్యమైనా అసలైన లబ్ధిదారులకు ప్లాట్ల డాక్యుమెంట్లు అందజేస్తాం. నానక్‌నగర్, తాడిపర్తి, కుర్మిద్ద గ్రామాల్లో కూడా త్వరలోనే జాబితా ప్రకటిస్తాం.
– అయ్యప్ప, తహసీల్దార్ యాచారం


