యాలాల: మండల కేంద్రానికి చెందిన ఓ ఆడ బిడ్డ వివాహానికి కాంగ్రెస్ సీనియర్ నేత పేరి రాజేందర్‌రెడ్డి, సరిత దంపతులు గురువారం పుస్తెమెట్టెలు అందజేశారు. పేద కుటుంబానికి చెందిన పెళ్లికూతురు తండ్రి మొగులయ్య ఆరేళ్ల క్రితమే మృతిచెందారు. ఈక్రమంలో తమవంతుగా రాజేందర్‌రెడ్డి అండగా నిలిచారు. పలువురు ఆడపడుచులతో కలిసి వెళ్లి, పెళ్లి కూతురు కుటుంబ సభ్యులకు పుస్తెమెట్టెలు అందించారు.
ఘన సన్మానం
అనంతగిరి: జిల్లా న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు లవకుమార్ ఆధ్వర్యంలో తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో విజయం సాధించిన అనంతసేనారెడ్డి, ఆకుల మహేశ్‌కుమార్‌ను గురువారం ఘనంగా సన్మానించారు. ఈ ప్రాంతానికి చెందిన ఇద్దరు న్యాయవాదులు ఎన్నిక కావడం సంతోషకరమైన విషయమన్నారు. వారి విజయం ఈ ప్రాంత న్యాయవాదులకు గర్వకారణమన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రతినిధులు, సీనియర్ నాయకులు, జూనియర్ న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.
పోషకాహారంతోనే
సంపూర్ణ ఆరోగ్యం
ఐసీడీఎస్ ప్రాజక్ట్ సీడీపీఓ నిర్మల
కొడంగల్ రూరల్: గర్భిణులు, బాలింతలు, బాలికలు పోషకాహారం తీసుకోవాలని అప్పుడే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని కొడంగల్ ఐసీడీఎస్ ప్రాజక్ట్ సీడీపీఓ నిర్మల అన్నారు. గురువారం మండలంలోని పర్సాపూర్ రైతు వేదికలో సర్పంచ్ కన్నం రాధ అధ్యక్షతన పోషణ్ పక్వాడ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె గర్భిణులు, బాలంతలు, కిషోర బాలికలకు పలు సూచనలు అందించారు. శిశువుకు ఆరు నెలలపాటు తల్లి పాలు పట్టాలన్నారు. అప్పుడే బిడ్డ ఆరోగ్యంగా ఉండటంతోపాటు రోగ నిరోధక శక్తి పెరుగుతుందని తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో అందించే బాలామృతం, గుడ్లు, ఆకుకూరలు క్రమం తప్పకుండా ఆహారంగా తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు దాసమ్మ, ప్రభ, సౌమ్య, పంచాయతీ కార్యదర్శి కల్పన, అంగన్‌వాడీ టీచర్లు పాల్గొన్నారు.
ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి
● బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు,
మాజీ ఎమ్మెల్యే ఆనంద్
● ఆర్టీసీ కార్మికులకు సంఘీభావం
అనంతగిరి: ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. గురువారం ఆయన వికారాబాద్ డిపో వద్ద సమ్మె చేస్తున్న కార్మికులకు సంఘీభావం తెలిపారు. వారికి మద్దతుగా దీక్షలో కూర్చున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మికుల సమ్మెకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. కమిటీల పేరుతో కాలాయాపన చేయడం సరికాదన్నారు. గతంలో కేసీఆర్ ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తే దానిని ఇప్పటిదాకా అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కాలాయాపన చేస్తోందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు వారి డిమాండ్లను వెంటనే నెరవేర్చాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో తరహాలో ఇక్కడ కూడా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికై నా ప్రభుత్వం చర్చలకు పిలిచి వారికి న్యాయం జరిగేలా చొరవ చూపాలని కోరారు. పోలీసులు ఆనంద్‌తోపాటు బీఆర్‌ఎస్ నాయకులను అరెస్టు చేసి పీఎస్‌కు తరలించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు శుభప్రద్‌పటేల్, పార్టీ పట్టణ అధ్యక్షుడు గోపాల్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కడియాల వేణుగోపాల్, సీనియర్ నాయకులు శేఖర్‌రెడ్డి, నరసింహ, రాంరెడ్డి, నర్సింహారెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, మల్లికార్జున్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.


