భారత్ ముక్తి మోర్చా రాష్ట్ర వర్కింగ్
ప్రెసిడెంట్ గోవింద్ నాయక్
పరిగి: కుల గణనలో ఓబీసీ కాలాన్ని పొందు పరచాలని భారత్ ముక్తి మోర్చా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోవింద్‌నాయక్ అన్నారు. కేంద్రం తీరుకు నిరసనగా గురువారం పరిగి బస్టాండ్ వద్ద ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1931లో బ్రిటిష్ ప్రభుత్వ హయాంలో జరిగిన కుల గణనలో ఓబీసీలను లెక్కించారని పేర్కొన్నారు. నాటి నుంచి ఏ ప్రభుత్వాలు కుల గణన చేయలేదని తెలిపారు. దేశంలోని ప్రతి జంతువుకూ లెక్కలు ఉన్నా బీసీలకు ఎందుకు లెక్కలు లేవని ప్రశ్నించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ బీసీలను ఓట్ల కోసమే వాడుకుంటున్నాయని విమర్శించారు. కేంద్రం బీసీ విద్యార్థుల కోసం తెచ్చిన యూజీసీ ఈక్విటీ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు వెంకటయ్య, నాగేష్ హబీబ్, సత్తయ్య, పీర్ మహ్మద్ తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
కందుకూరు: రోడ్డు ప్ర మాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. ఈసంఘటన కందుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాలు.. రాచులూరుకు చెందిన గుంటి ప్రశాంత్(25) వృత్తిరీత్యా మత్స్యకారుడు. బుధవారం ఉదయం చేపల వేటకు బైక్‌పై ధన్నారం వెళ్లాడు. రాత్రి తిరిగి వస్తున్నాడు. ఈ సమయంలో బైరాగిగూడ గేట్ సమీపంలో ట్రాలీతో పాటు కాంక్రీట్ మిషన్, దానికి అనుసంధానంగా ఉన్న ఆయిల్ ఇంజన్‌తో ఉన్న ట్రాక్టర్ రాచులూరు గేట్ వైపు మరలుతోంది. దీనికి ఎలాంటి రేడియం స్టిక్కర్లు లేకపోవడంతో వెనక ఉన్న ఆయిల్ ఇంజన్‌ను అంచనా వేయలేక బైక్‌తో ఢీకొట్టాడు. గమనించిన స్థానికులు 108 అంబులెన్స్ వాహనంలో ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు. ఈ మేరకు ఎస్‌ఐ పరమేశ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
దారి దోపిడీ ముఠా అరెస్టు
బంజారాహిల్స్: ఆవారాగా తిరుగుతూ జల్సాలు, గంజాయి కోసం దారి దోపిడీలకు పాల్పడుతున్న ముఠాను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాలు.. ఇటీవల జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–5లో మెట్రోస్టేషన్ వద్ద అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న ర్యాపిడో డ్రైవర్ శుభాంకర్ కుమార్‌ను రహమత్‌నగర్, బోరబండ ప్రాంతాలకు చెందిన బర్ల పవన్‌కళ్యాణ్ అలియాస్ డీజే పవన్, సాయిరాజ్ కుమార్ అలియాస్ చిట్టి, రేసు ప్రణీత్‌రెడ్డి, జశ్వంత్, అఖిల్, చందు, గోవు ఈశ్వర్ అటకాయించారు. దాడి చేసి బలవంతంగా మొబైల్ ఫోన్ లాక్కొని పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనాస్థలంలోని సీసీ ఫుటేజీని పరిశీలించి పవన్‌కళ్యాణ్, రేసు ప్రవీణ్‌రెడ్డి, గోవు ఈశ్వర్‌గౌడ్‌లను గుర్తించి గురువారం అరెస్టు చేశారు. మిగతా నిందితుల కోసం గాలింపు చేపట్టారు.


