సరదా కోసం వెళ్లి మృత్యు ఒడిలోకి..
అపస్మారక స్థితిలో తండ్రి పండుగ వేళ విషాదం
తాండూరు టౌన్: తాండూరు పట్టణానికి చెందిన ఓ విద్యార్థి కృష్ణానదిలో మునిగి మృతి చెందగా, కాపాడేందుకు యత్నించిన తండ్రి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. ఈ విషాధ ఘటన శుక్రవారం మక్తల్ సమీపంలో చోటుచేసుకుంది. బంధువులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని ఆదర్శ నగర్‌లో నివాసం ఉంటున్న మహేష్ తన భార్య, కూతురు, కొడుకుతో కలిసి సంక్రాంతి సెలవుల్లో మక్తల్‌లోని బంధువుల ఇంటికి వెళ్లారు. శుక్రవారం సరదాగా గడిపేందుకు కృష్ణానది తీరానికి వెళ్లారు. ప్రమాదవశాత్తు కొడుకు గౌరీప్రీతమ్(12) నీటిలో పడి మునిగి పోతుండగా, కాపాడేందుకు తండ్రి మహేష్ యత్నించినా ఫలితం లేకుండా పోయింది. నీట మునిగి కొడుకు మృతి చెందగా, తండ్రి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. వెంటనే అతన్ని చికిత్స నిమిత్తం రాయచూరు ఆసుపత్రికి తరలించారు. మృతుడు గౌరీప్రీతమ్ తాండూరులోని చైతన్య పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్నాడు. బాలుని శవానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. బాలుడు మృతి చెందిన విషయం తెలియడంతో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు కన్నీటి పర్యంతమయ్యారు.
కృష్ణానదిలో నీట మునిగి కొడుకు మృతి


