బహుజన రాజ్యం సాధిస్తాం
షాద్‌నగర్: తెలంగాణలో బహుజన రాజ్యాధికారం సాధిస్తామని బీఎస్పీ సెంట్రల్ సెక్టార్ కో ఆర్డినేటర్ అతార్‌సింగ్‌రావు అన్నారు. పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి పుట్టిన రోజును పురస్కరించుకొని శుక్రవారం పట్టణంలోని సాయిరాజ ఫంక్షన్ హాల్‌లో ఆత్మగౌరవ సభ నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు దొడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. సభకు హాజరైన అతార్‌సింగ్‌రావు మాట్లాడుతూ.. నీళ్లు, నిధులు, నియామకాల డిమాండ్‌తో ఏర్పడిన తెలంగాణ పోరాటంలో అన్నివర్గాల ప్రజలు పాల్గొన్నారన్నారు. అమరుల త్యాగాల ఫలితంగా వచ్చిన ప్రత్యేక రాష్ట్రంలో బహుజనులకు తగిన ప్రాధాన్యం దక్కడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. అన్ని పార్టీల నాయకులు కుట్రలు పన్ని, బహుజనులను అధికారానికి దూరం చేస్తున్నారని మండిపడ్డారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రం శేఖర్ మాట్లాడుతూ.. సంక్రాంతి సందర్భంగా ఎగరాల్సినవి పతంగులు కానవి, ఆత్మగౌరవ జెండాలని అన్నారు. బీఎస్పీతోనే అది సాధ్యమని స్పష్టంచేశారు. సమానత్వం, ఆర్థిక విముక్తితో సంక్రాంతి సంబురాలు జరుపుకోవాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై దాడులు, హత్యలు, అత్యాచారాలు పెరిగాయని ఆరోపించారు. వీటిని అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టకపోవడం శోచనీయమని ఆవేదన వ్యక్తంచేశారు. బీఎస్పీ అధికారంలోకి వస్తే బహుజనులను కాపాడుకుంటామన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ ప్రవీణ్ ఆ పార్టీకి రాజీనామా చేసి బీఎస్పీ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో నాయకులు నాగన్న, కృష్ణ, బండి పృధ్వీరాజ్, శివప్రసాద్, నరేందర్, రాములు, రవి, అమీర్ తదితరులు పాల్గొన్నారు.


