బైక్‌ను ఢీ కొట్టిన కారు
ఇద్దరికి తీవ్ర గాయాలు
దుద్యాల్: బైక్‌ను వెనుక నుంచి కారు ఢీ కొట్టడంతో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన దుద్యాల్ గేట్ సమీపంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్‌ఐ శ్రీశైలం కథనం మేరకు.. మండలంలోని హస్నాబాద్‌కు చెందిన ముస్తాక్, అబ్దుల్ నబి నారాయణపేట్ జిల్లా కోస్గి పట్టణంలోని ఓ రైస్ మిల్లులో పని చేస్తున్నారు. ఎప్పటిలాగే పనులు ముగించుకొని రాత్రి ద్విచక్ర వాహనంపై ఇంటికి బయలుదేరారు. దుద్యాల్ గేట్ వద్దకు రాగానే వెనుక నుంచి కారు ఒక్కసారిగా ఢీ కొట్టింది. దీంతో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను కొడంగల్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో నగరంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శ్రీశైలం తెలిపారు.


