దెబ్బడగూడలో అవకాడో..
కందుకూరు: విదేశాల్లో మాత్రమే పండి అధిక డిమాండ్ ఉన్న పంటల్లో అవకాడో ఒకటి. ఆ పంటను మండలంలోని దెబ్బడగూడకు చెందిన యువకుడు జైపాల్‌నాయక్ సాగు చేసి శభాష్ అనిపించుకున్నాడు. యూకేలో ఎంబీఏ పూర్తిచేసి ఇండియాకు తొరిగొచ్చాడు. యూకే, ఇజ్రాయిల్‌లో సాగు చేసిన అవకాడోను ఇక్కడ పండించాలని నిర్ణయించుకున్నడాడు. 2012లో మొదట హాస్ రకం మొక్కలను తెచ్చి నాటి విఫలమయ్యాడు. తర్వాత బంగ్లాదేశ్‌లో బల్బూ రకం అధిక దిగుబడి రావడంతో పాటు ఇక్కడి ఉష్ణోగ్రతలకు తగ్గట్లుగా ఉన్నట్లు గుర్తించాడు. పట్టుదలతో ఆ రకం మొక్కలను 2021లో తెప్పించి ఎకరం 30 గుంటల విస్తీర్ణంలో సాగు చేశాడు. మూడేళ్ల తర్వాత పంట దిగుబడి ప్రారంభమైయింది. ప్రస్తుతం మొక్కకు 15 నుంచి 20 కిలోల మేర దిగుబడి సాధిస్తున్నాడు. కిలో సరాసరి రూ.200 నుంచి రూ.300 వరకు పొలం వద్దనే విక్రయిస్తూ లాభాలు ఆర్జిస్తున్నాడు. ఖర్చులు పోను ఎకరాకు సుమారు ఏడాదికి రూ.2 లక్షలకు పైనే సంపాదిస్తున్నాడు. ప్రస్తుతం అవకాడోను సాగు చేయడానికి ఆసక్తి చూపుతున్న రైతుల కోసం తానే సొంతంగా నర్సరీని ఏర్పాటు చేసి మొక్కలు విక్రయిస్తూ, మెలకువలు నేర్పిస్తున్నాడు.


