● ఆపిల్.. వెల్
కందుకూరు: ఎక్కడో హిమాచల్‌ప్రదేశ్, జమ్మూకశ్మీర్ ప్రాంతాల్లో పండే ఆపిల్ పంటను మన దగ్గర సాగు చేపట్టారు. నిత్యం హోమాలు, పూజలు జరిగే పులిమామిడి శ్రీనిఖిల్ చేతనా కేంద్రంలో నిర్వాహకులు 2021 సంవత్సరంలో ఆశ్రమం అవసరాల కోసం ఆపిల్ పంటను సాగు చేశారు. హిమాచల్‌ప్రదేశ్ నుంచి హరిమన్ 99 రకం మొక్కలను తెప్పించి ముప్పై గుంటల విస్తీర్ణంలో సాగు చేశారు. రెండో ఏడాది నుంచే పంట దిగుబడి ప్రారంభమైంది. మూడో ఏడాది ఒక్కో మొక్క నుంచి దాదాపు 200 కాయల వరకు కాసాయి. ఏటా డిసెంబర్‌లో మొక్కల కొమ్మలను కత్తిరించి, ఆకులు మొత్తాన్ని తొలగిస్తే, కొత్త చిగుర్లు వచ్చి 30 నుంచి 40 రోజుల్లో పూత మొదలవుతుంది. ఏప్రిల్, మే నెలల్లో పంట కోతకు వస్తుంది.


