750 మంది ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రం
మున్సిపల్ ఎన్నికలలో ఓటర్లకు ఇబ్బందులు తలెత్తకుండా పోలింగ్ కేంద్రాలలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని తాండూరు మున్సిపల్ కమిషనర్ యాదగిరి అన్నారు. మంగళవారం ఆయన మున్సిపల్ పరిధిలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. విద్యుత్ సరఫరా, ర్యాంపులు, తాగునీరు, మరుగుదొడ్ల తీరుపై ఆరా తీశారు. ఇందిరానగర్‌లోని 6వ వార్డులో ఉన్న కమ్యూనిటీ హాల్ పోలింగ్ కేంద్రంగా ఎంపిక చేశారు. ఇక్కడ అర్బన్ హెల్త్ సెంటర్ కొనసాగుతోంది. హెల్త్ సెంటర్‌ను పోలింగ్ కేంద్రంగా వినియోగించాలా లేదా కేంద్రాన్ని మరో చోటికి తరలించాలా ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. 750 మంది ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దీంతో తాండూరు మున్సిపాలిటీలో మొత్తం 117 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కమిషనర్ వెంట మున్సిపల్ ఏఈ ఖాజా, సిబ్బంది తదితరులున్నారు.


