బంగారు వర్ణంలో భానుడు
మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించే సంక్రాంతి వేళ ఆకాశంలో అపూర్వ దృశ్యాలు ఆవిష్కృతమయ్యాయి. మకర సంక్రాంతికి ముందే మంగళవారం సాయంత్రం తాండూరు శివారులో సూర్యాస్తమయం సమయంలో సూర్యుడు బంగారు వర్ణంతో కనిపించి అలరించాడు. – తాండూరు
పెళ్లికి ఒప్పుకోలేదని..
అనంతగిరి: ప్రేమించిన వ్యక్తి వివాహం చేసుకోవడానికి నిరాకరించినందుకే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని కొత్తగడి సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న చిత్తారమ్మ తండ్రి ఆరోపించారు. కుటుంబీకులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వికారాబాద్ మండలం మైలార్‌దేవరాంపల్లికి చెందిన నర్సయ్యకు ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నాడు. చిన్నమ్మాయి చిత్తారమ్మ(26) నవాబుపేట మండలం ఎక్‌మామిడికి చెందిన ఓ వ్యక్తి రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఆయన వికారాబాద్‌లోని ఓ రెసిడెన్షియల్ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తున్నారు. యువతి కూడా టీచర్ ట్రైనింగ్ పూర్తి కాగా కొన్నాళ్లు పట్టణంలో ప్రైవేట్‌గా విధులు నిర్వహించారు. వీరు ప్రేమించుకున్న విషయం యువతి ఇంట్లో తెలియగా పెళ్లికి అంగీకరించారు. సదరు వ్యక్తితో మాట్లాడడానికి పిలిచినా రాలేదని నర్సయ్య తెలిపారు. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం చిత్తారమ్మ ఎక్‌మామిడి గ్రామానికి వెళ్లారు. అక్కడ ఏం జరిగిందో తెలియదు కానీ మనస్తాపం చెందిన ఆమె నేరుగా కొత్తగడి వద్ద దిగారు. అప్పటికే ఆమె చాలా సేపు ఫోన్‌లో మాట్లాడుతూనే సమీపంలో ఉన్న రైలు పట్టాల వైపు వెళ్లారు. సాయంత్రం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. తన బిడ్డ మృతికి కారణమైన వ్యక్తిపై తగిన చర్యలు తీసుకోవాలని మృతురాలి తండ్రి నర్సయ్య మంగళవారం వాపోయారు. ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీ వద్ద కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు. అనంతరం మీడియా ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు. ఈ మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధితులు ఎస్పీ కార్యాలయంలో సైతం ఫిర్యాదు చేశారు.
రైలుకింద పడి యువతి బలవన్మరణం
బంగారు వర్ణంలో భానుడు


