పారని ‘అమృత్‌’ ధార | - | Sakshi
Sakshi News home page

పారని ‘అమృత్‌’ ధార

Jan 13 2026 7:41 AM | Updated on Jan 13 2026 7:41 AM

పారని ‘అమృత్‌’ ధార

పారని ‘అమృత్‌’ ధార

పురపాలికల్లో తాగునీటి సరఫరాకు వినియోగం పనులు ప్రారంభమై ఏడాదిన్నరైనా20 శాతం పనులే పూర్తి నాలుగు మున్సిపాలిటీల్లో ట్యాంకుల నిర్మాణం, పైప్‌లైన్ల ఏర్పాటుకు రూ.59 కోట్లు అత్యధికంగా తాండూరుకు రూ.27 కోట్లు

మున్సిపాలిటీలకు అమృత్‌–2.0 కింద నిధుల మంజూరు

వికారాబాద్‌: పట్టణ వాసుల దాహార్తిని తీర్చేందుకు తీసుకువచ్చిన అమృత్‌ 2.0 పథకం పనులు నత్తనడక సాగుతున్నాయి. ఈ పథకం కింద జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలకు పెద్ద మొత్తంలో నిధులు మంజూరు కాగా పనులు చేపట్టడంలో కాంట్రాక్టర్లు మీనమేశాలు లెక్కిస్తున్నారు. పబ్లిక్‌ అండ్‌ హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌ ఇంజనీరింగ్‌ విభాగం అధికారులకు పనుల పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. వారు హైదరాబాద్‌ నుంచి చుట్టపు చూపుగా వచ్చి వెళుతున్నారు. దీంతో ఇప్పటి వరకు 20 శాతం పనులు కూడా పూర్తి చేయలేదు.

నూతన కాలనీలకు ప్రాధాన్యత

అమృత్‌–2.0 పథకం కింద మంజూరయ్యే నిధులతో మున్సిపాలిటీలలో తాగునీటి సరఫరా వ్యవస్థను బలోపేతానికి వినియోగిస్తున్నారు. ఈ పథకానికి సంబంధించి ఏడాదిన్నర క్రితం టెండర్‌ ప్రక్రియ పూర్తి చేసిన అధికారులు నాలుగు మున్సిపాలిటీల్లో శంకుస్థాపనలు చేసి 16 నెలలు దాటింది. ఐదేళ్ల క్రితమే గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మిషన్‌ భగీరథ పథకం ద్వారా తాగునీటి వ్యవస్థను బలోపేతం చేయగా ఆ పథకం పనులు పూర్తయ్యాక ఏర్పాటైన కాలనీల్లో తాగునీటి వ్యవస్థ మెరుగుపర్చేందుకు ఈ పథకంలో ప్రాధాన్యతనిస్తున్నారు.

నిధులున్నా ముందుకు సాగని పనులు

జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో అమృత్‌–2.0 పథకం అమలు చేస్తున్నారు. ఈ పథకం ద్వారా ఉన్న వనరులను సక్రమంగా సరఫరా చేసేందుకు కావాల్సిన సదుపాయాలను బలోపేతం చేస్తున్నారు. మున్సిపాలిటీల్లో ఉపరిత ట్యాంకుల(ఓహెచ్‌ఎస్‌ఆర్‌) నిర్మాణం, పైప్‌లైన్ల ఏర్పాటు, నల్లా కనెక్షన్లు తదితర పనులు చేపడుతున్నారు ప్రస్తుతం వికా రాబాద్‌ మున్సిపాలిటీలో 75 వేలు, తాండూరులో 85వేలు, పరిగిలో 35 వేలు, కొడంగల్‌లో 25 వేల జనాభా ఉండగా వీరి అవసరాలకు అనుగుణంగా తాగునీటి వ్యవస్థను బలోపేతం చేసేలా పనులు చేపట్టాల్సి ఉంది. నిధులు మంజూరైనప్పటికీ పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. అక్కడక్కడ పైపులు వేయడం, ఉపరితల ట్యాంకుల నిర్మాణానికి పునాదులు తీయటం, అక్కడక్కడ పైప్‌లైన్లు వేసే పనులకే పరిమితమయ్యారు.

145 ఎంఎల్‌డీ పంపింగ్‌

జిల్లాలో రెండు చోట్ల వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లు (నీటి శుద్ధి కేంద్రాలు) అందుబాటులో ఉన్నాయి. పరిగి మండలం జాఫర్‌పల్లి సమీపంలోని వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంటు రోజుకు 135 ఎంఎల్‌డీ (మిలియన్‌ లీటర్‌ ఫర్‌డే) నీటిని శుద్ధి చేసి పంపింగ్‌ చేసే సామర్థ్యం ఉండగా.. కొడగంల్‌లో 17 ఎంఎల్‌డీ సామర్థ్యం కలిగిన నీటి శుద్ధి కేంద్రం అందుబాటులో ఉంది. రోజుకు 18 గంటల నుంచి 22 గంటలు నీటిని శుద్ధి చేయిస్తారు. జిల్లాలో ప్రస్తుతం సుమారుగా 11.5 లక్షల జనాభా నివసిస్తుండగా రోజుకు వారి అవసరాలకు 130 ఎంఎల్‌డీ నీరు అవసరం అవుతాయి. ప్రస్తుతం రోజుకు జిల్లాలోని రెండు వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లలో 145 ఎంఎల్‌డీ నీటిని శుద్ధి చేసి పంపింగ్‌ చేస్తున్నారు. వీటితో పాటు స్థానికంగా మరిన్ని అదనపు నీటి వనరులు అందుబాటులో ఉన్నాయి. వికారాబాద్‌లో శివారెడ్డిపేట్‌ చెరువు, తాండూరులో కాగ్నా వనరులతో పాటు అత్యవసర సమయం వేసవిలో మున్సిపాలిటీల్లో ఉన్న బోరుబావులు తదితర నీటి వనరులను సైతం వినియోగిస్తారు. పరిగిలోని తిరుమల, మైత్రి వెంచర్‌ కాలనీలు, వెంకటేశ్వర టెంపుల్‌ కాలనీల్లో రెండేళ్లుగా తాగునీటి సరఫరా నిలిచి పోయింది. ఈ కాలనీల్లో ఉన్న బోరుబావులు సైతం అడుగంటటంతో వాటర్‌ ట్యాంకర్ల ద్వారా నీటిని తెచ్చుకుంటున్నారు. ఇలా మున్సిపాలిటీల పరిధిలోని అనేక కాలనీల్లో ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడుతుండగా కాంట్రాక్టర్లు చేపడుతున్న పనులు మాత్రం ముందుకు సాగడం లేదు.

నిధుల మంజూరు వివరాలు

మున్సిపాలిటీ మంజూరైన నిధులు

తాండూరు రూ.27 కోట్లు

పరిగి రూ.15.5 కోట్లు

వికారాబాద్‌ రూ.12 కోట్లు

కొడంగల్‌ రూ.4.5 కోట్లు

మొత్తం రూ.59 కోట్లు

కాంట్రాక్టర్‌కు నోటీసులు

కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యం కారణంగా పనులు నెమ్మదించాయి. లేబర్‌ను ఎక్కువగా పెట్టడం లేదు. ఇదే విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదించాం. వారు సదరు కాంట్రాక్టర్‌కు నోటీసులు ఇచ్చారు. పనులు త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటాం. ఇప్పటి వరకు పూర్తైన బిల్లులు ప్రభుత్వానికి ఇచ్చాం. బిల్లులు సైతం మంజూరవుతున్నాయి.

– సాజిద్‌, డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్‌ ఇంజనీర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement