ఐక్య పోరాటాలతోనే హక్కులకు రక్షణ
తాండూరు టౌన్: ఐక్య పోరాటాలతోనే కార్మికుల హక్కులకు రక్షణ ఉంటుందని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పద్మశ్రీ అన్నారు. సోమవారం స్థానిక అంబేడ్కర్ చౌక్‌లో సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన పోరుయాత్ర ముగింపు సభకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో కార్మికుల శ్రమను దోచే లేబర్ కోడ్‌లను తీసుకురావడం సరికాదన్నారు. కార్మిక సంఘాలను సంప్రదించకుండా నూతన లేబర్ కోడ్‌లను అమల్లోకి తెచ్చి కార్మిక హక్కులను కాలరాసిందని మండిపడ్డారు. మూడు షిప్టుల విధానం తొలగించి డే, నైట్ షిఫ్ట్‌లకు పరిమితం చేసి కార్మికులను బానిసలుగా మార్చిందన్నారు. హక్కుల సాధనకు సంఘాలన్నీ కలిసి ఐక్య పోరాటం చేయాలని కోరారు. ఫిబ్రవరి 12న జరిగే దేశ వ్యాప్త సమ్మెకు కార్మికులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలు కార్మిక సంఘాల నాయకులు కె.శ్రీనివాస్, బుగ్గప్ప, వెంకటయ్య, మైపాల్, రామకృష్ణ, చంద్రయ్య, మల్కయ్య, శరణప్ప, బాలమణి, బేబి, రామాంజమ్మ, శశికళ, విజయలక్ష్మి, సరస్వతి తదితరులు పాల్గొన్నారు.
12న దేశవ్యాప్త సమ్మె
యాలాల: కార్మిక వర్గ హక్కుల పరిరక్షణకు ఫిబ్రవరి 12న నిర్వహించనున్న దేశ వ్యాప్త సమ్మెకు కార్మికులు సిద్ధంగా ఉండాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పద్మశ్రీ పిలుపునిచ్చారు. పోరుయాత్రలో భాగంగా సోమవారం సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బుగ్గప్పతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. శ్రమ శక్తి నీతి 2025 పేరిట మోదీ సర్కార్ లేబర్‌కోడ్ తీసుకువచ్చిందని విమర్శించారు. ఎనిమిది గంటల పని విధానానికి బదులుగా 12 గంటలకు పెంచి కార్మికుల విశ్రాంతిని గాలికి వదిలేసిందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రామకృష్ణ, శ్రీనివాస్, వ్యకాస జిల్లా కార్యదర్శి వెంకటయ్య, రైతు సంఘం జిల్లా కార్యదర్శి మహిపాల్, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు చంద్రయ్య, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి మల్కయ్య, కార్మికులు మణిమాల, మంజుల, ఆరిఫ్, శివకుమార్, ఆనందం, శ్రీనివాస్, చిన్న తదితరులు పాల్గొన్నారు.


