ప్రజలకు మెరుగైన వైద్య సేవలు
పరిగి: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి అన్నారు. సోమవారం పట్టణ కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రిలో ఆస్పత్రి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే ఆస్పత్రి నిర్వహణ, రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతీ రోగికి మెరుగైన సేవలను అందించాలని సూచించారు. వైద్యులు విధులపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రతీ పేదకు ఉచిత వైద్యం, విద్య నాణ్యమైనవిగా అందేలా కృషి చేస్తున్నారన్నారు. ఆస్పత్రిలో సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామన్నారు. రూ.27 కోట్లతో నిర్మిస్తున్న వంద పడకల ఆస్పత్రి నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సూచించారు. నిర్మాణ పనులల్లో నాణ్యతపాటించాలన్నారు. ఈ ఆస్పత్రి నిర్మాణం పూర్తయితే ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలు అందుతాయన్నారు. అనంతరం పట్టణ కేంద్రంతో పాటు జాపర్‌పల్లిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజశేఖర్, నాయకులు పార్థసారథి పంతులు తదితరులు పాల్గొన్నారు.
పక్కాగా ఆరు గ్యారంటీల అమలు
పూడూరు: అర్హులైన ప్రతీ ఒక్కరికి ఆరు గ్యారంటీలను పక్కాగా అమలు చేస్తున్నామని ఇందుకు గృహజ్యోతి పథకం నిదర్శనమన్నారు. సోమవారం మండల పరిధిలోని మన్నెగూడలో గృహజ్యోతి పథకం ప్రోసీడింగ్‌లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇచ్చిన మాట ప్రకారం గృహజ్యోతి పథకం ద్వారా రాష్ట్రంలో 52.82 లక్షల మంది కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత కరెంట్‌ను అందిస్తున్నామని అన్నారు. పరిగి నియోజకవర్గంలో 43వేల 276 మంది అర్హులుగా ఎంపిక అయ్యారని వారికి రూ.106 కోట్లు మాఫీ అయ్యాయని చెప్పారు. దరఖాస్తులు చేయని వారికి కూడా గృహ జ్యోతి పథకం అందేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. అనంతరం పూడూరు మండల కేంద్రంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మన్నెగూడ సర్పంచ్ తమన్నా అజీంపటేల్, పార్టీ మండల అధ్యక్షుడు సురేందర్, విద్యుత్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.


