మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు
కలెక్టర్ ప్రతీక్‌జైన్
అనంతగిరి: ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణకు పూర్తి స్థాయి ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రతీక్‌జైన్ అన్నారు. సోమవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు హైదరాబాద్ నుంచి మున్సిపల్ శాఖ కార్యదర్శి శ్రీదేవితో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌లో అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్‌నిర్వహించారు. ఈ సమీక్షలో కలెక్టర్ ప్రతీక్‌జైన్ మాట్లాడుతూ.. తుది ఓటరు జాబితా ప్రకటన, ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితా, తుది పోలింగ్ కేంద్రాల జాబితాను ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం ప్రకటిస్తామన్నారు. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎన్నికల నిర్వహణకు నోడల్ అధికారులు, జోనల్ అధికారులు, ఫ్లయింగ్, స్టాటిస్టిక్ సర్వేలెన్స్ బృందాలు, సెక్టోరియల్ అధికారులు, నామినేషన్ స్వీకరణ కేంద్రాలు, ఎన్నికల సామగ్రి పంపిణీ, స్వీకరణ కేంద్రాలు, కౌంటింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటుకు అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) సుధీర్, మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ప్రతిష్టాత్మకంగా వైఐఐఆర్‌ఎస్ నిర్మాణం
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను (వైఐఐఆర్‌ఎస్) ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోందని కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల, షెడ్యూల్డ్ తెగల, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్, పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, టీజీఈడబ్ల్యూఐడీసీ ఎండీ గణపతితో కలిసి జిల్లాల కలెక్టర్లు, టీజీఈడబ్ల్యూఐడీసీ అధికారులతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణ పురోగతిపై సమీక్షించారు. జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ.. జిల్లాకు నాలుగు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్‌రెసిడెన్షియల్ పాఠశాలలు మంజూరు కాగా, సంబంధిత పాఠశాలలకు భూమిని కేటాయించామన్నారు. టెండర్ ప్రక్రియ సైతం పూర్తి చేశామని తెలిపారు. వికారాబాద్, కొడంగల్ నియోజకవర్గాల్లో ఇప్పటికే పనులు మొదలయ్యాయని.. మిగిలన రెండు అగ్రిమెంట్ దశలో ఉన్నాయని వివరించారు. పాఠశాలల పనులు కూడా త్వరితగతిన ప్రారంభించి వచ్చే విద్యా సంవత్సరానికిపూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ కాన్ఫరెన్స్‌లో డీఈఓ రేణుకా దేవి, మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఫిర్యాదులు సకాలంలో పరిష్కరించాలి
ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్ ప్రతీక్‌జైన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాజేశ్వరి, సుధీర్, ట్రెయినీ కలెక్టర్ హర్ష్ చౌదరి, ఆర్‌డీఓ వాసుచంద్ర, డీఆర్‌డీఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


