ఉన్నత లక్ష్యాల సాధనకు కృషి
సినీనటుడు ప్రదీప్
చేవెళ్ల: విద్యార్థి దశలోనే ఉన్నతమైన లక్ష్యాలను ఎంచుకొని, వాటి సాధన కోసం కృషి చేయాలని ప్రము ఖ వక్త, సినీ ప్రముఖుడు కేవీ.ప్రదీప్ అన్నారు. చేవెళ్లలోని వివేకానంద జూనియర్, డిగ్రీ కళాశాల వార్షికోత్సవం సోమవారం ప్రిన్సిపాల్ జైపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రదీప్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రసంగించారు. విద్యార్థులు వివేకానందుడు చూపించిన మార్గాల్లో నడవాలన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించుకోవాలని తెలిపారు. తల్లిదండ్రులు, అధ్యాపకులకు, గ్రామానికి మంచి పేరుతీసుకువచ్చే విధంగా విద్యార్థులు ఎదగాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో డి.ప్రభాకర్, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


