‘కరెంట్’గా లెక్కిస్తాం!
ప్రతి నాలుగు యూనిట్ల విద్యుత్ వినియోగానికి ఒక మెట్రిక్ టన్నుగా గుర్తింపు ఒక్కో మెట్రిక్ టన్నుపై రూ.175 రాయల్టీ అక్రమ క్రషర్లు, మైనింగ్ సరుకు రవాణా వాహనాలపై నిఘా మైన్స్ వద్ద సీసీ కెమెరాల ఏర్పాటు ఓవర్ లోడ్ పైనా నజర్
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ప్రభుత్వ శాఖల నుంచి ఎలాంటి అనుమతులు పొందకుండా గుట్టుగా ఏర్పాటు చేసిన స్టోన్ క్రషర్ల నియంత్రణ కోసం ప్రభుత్వం కొత్త పాలసీని తీసుకొస్తుంది. ఇకపై క్రషర్లు వాడే విద్యుత్ ఆధారంగా రాయల్టీ వసూలు చేయాలని నిర్ణయించింది. ప్రతి నాలుగు యూనిట్ల విద్యుత్‌కు ఒక మెట్రిక్ టన్ను చొప్పున లెక్కించనున్నారు. ఒక్కో మెట్రిక్ టన్ను రోబో సాండ్/కంకరకు రూ.175 చొప్పున రాయల్ట్టీ వసూలు చేయనుంది. తద్వారా అక్రమ మైనింగ్, రవాణాకు చెక్ పెట్టొచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఆ మేరకు కొత్తగా స్టోన్ క్రషర్ పాలసీని తీసుకొస్తుంది. అంతేకాదు అక్రమార్కులను గుర్తించేందుకు ఓఆర్‌ఆర్‌పై నాలుగు తనిఖీ బృందాలను కూడా ఏర్పాటు చేసింది. రాయల్టీ ఎగ్గొట్టే వాళ్లను గుర్తించేందుకు మైనింగ్/క్రషర్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తోంది. వాహనాల రాకపోకలు సహా ఓవర్ లోడుతో వెళ్లే వాహనాల వివరాలు కూడా ఇట్టే తెలిసిపోతుంది.
ఆదాయానికి పొంతన లేదు
జిల్లాలో గ్రానైట్, క్వార్ట్జ్, లాటరేట్, బ్లాక్ గ్రానైట్, రోడ్ మెటల్స్ క్వారీలు 150 ఉన్నాయి. అదే విధంగా 50 వరకు స్టోన్ క్రషర్లు ఉన్నాయి. మైనింగ్ లీజులు, రాయల్టీ వసూళ్ల ద్వారా ప్రభుత్వానికి ఏటా రూ.170 కోట్ల ఆదాయం సమకూరుతుంది. నిజానికి మైనింగ్‌శాఖ నుంచి పొందిన అనుమతులకు, క్షేత్రస్థాయిలో జరిపిన తవ్వకాలకు అసలు పొంతనే ఉండటం లేదు. ఫలితంగా ప్రభుత్వానికి రాయల్టీ రూపంలో తగిన ఆదాయం రావడం లేదు. ముఖ్యంగా అబ్దుల్లాపూర్‌మెట్ మండల పరిధిలోని బండరావిర్యాల, చిన్న రావిర్యాల, కొత్తూరు, కడ్తాల్, ఆమనగల్లు, యాచారం మండలాల్లో ఈ అక్రమ మైనింగ్ దందా ఎక్కువగా జరుగుతోంది. జిల్లా మైనింగ్ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు ఆయా క్వారీలు/మైన్స్‌లో పర్యటించి చేపట్టిన తవ్వకాలను గుర్తించి, పెనాల్టీలు వసూలు చేయాల్సి ఉంది. కానీ మైనింగ్ వ్యాపారులు ఇచ్చే నెలవారీ మామూళ్లకు అలవాటు పడిన అధికారులు అటు వైపు కన్నెత్తి చూడటం లేదు.
తనిఖీల్లో వెల్లడైన అక్రమాలు
నిజానికి ఏదైనా క్రషర్ ఏర్పాటు చేయాలంటే ముందు స్థానిక సంస్థల నుంచి నిరభ్యంతర పత్రం తీసుకోవాలి. రెవెన్యూ అధికారుల అనుమతి పొందాలి. మైనింగ్‌శాఖ వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. కాలుష్య నియంత్రణలో భాగంగా పీసీబీ నుంచి ఎన్‌ఓసీ పొందాలి. పరిశ్రమల విభాగం సహా లేబర్ లైసెన్సులు పొంది ఉండాలి. కానీ శంషాబాద్, మామిడిపల్లి, కొత్వాల్‌గూడ, నార్సింగి, జన్వాడ, మీర్జాగూడ, శంకర్‌పల్లిలో 22 క్రషర్లు ఉండగా, వీటిలో మెజార్టీ క్రషర్లకు అనుమతులు లేవు. ఇక అబ్దుల్లాపూర్‌మెట్ బండరావిర్యాల, చిన్న రావిర్యాలలో 40 మైన్లు, 17 క్రషర్లు ఉండగా, వీటిలో ఐదు క్రషర్లకు ఎలాంటి అనుమతులు లేవు. కొహెడ, మంచాల, యాచారంలో అక్రమ క్రషర్ల దందా కొనసాగుతున్నట్లు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ నిర్వహించిన తనిఖీల్లో వెల్లడైంది.
ఇక నుంచి స్టోన్ క్రషర్ పాలసీ అమలు
రూ.220 కోట్ల ఆదాయం లక్ష్యం
అక్రమ మైనింగ్‌ను నియంత్రించడంతో పాటు ప్రభుత్వ ఆదాయాన్ని పెంచేందుకే ప్రభుత్వం ఈ స్టోన్ క్రషర్ పాలసీని తీసుకొచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. విద్యుత్ మీటర్ రీడింగ్ ఆధారంగా తరలించిన రోబో సాండ్, కంకర పరిణామాన్ని లెక్కించనుంది. నిబంధనలకు విరుద్ధంగా జరిపిన తవ్వకాలకు పెనాల్టీ వేసి, వారి నుంచి వసూలు చేయనుంది. ఈ పాలసీ వల్ల ప్రస్తుతం ఏటా రూ.170 కోట్లుగా ఉన్న ప్రభుత్వ ఆదాయం రూ.220 కోట్లకు పెరిగే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇదిలా ఉంటే సెల్లార్ తవ్వకాలు, మట్టి అక్రమ అమ్మకాలపై మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోక పోవడంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.


