వ్యాపారస్తుల సహకారంతో మార్కెట్ అభివృద్ధి
ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్ ముదిరాజ్
అనంతగిరి: వ్యాపారస్తుల సహకారంతో వికారాబాద్ మార్కెట్ కమిటీని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్ ముదిరాజ్ అన్నారు. సోమవారం వికారాబాద్ వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో ది గ్రీన్ మర్చెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతన పాలకవర్గాన్ని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు చిగుళ్లపల్లి రమేశ్‌కుమార్, ఏఎంసీ వైస్ చైర్మన్ మల్లేశం, డైరక్టర్లు, వ్యాపారస్తులు తదితరులు పాల్గొన్నారు.
కారును ఢీకొట్టిన లారీ
పరిగి: కారును లారీ ఢీకొట్టడంతో పలువురు గాయపడ్డారు. ఈ ఘటన మండల పరిధిలోని సుగుణ స్టీల్ ఫ్యాక్టరీ ఎదుట సోమవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన ప్రకారం.. పట్టణ కేంద్రానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు శంకర్‌రావు తన భార్య, ఇద్దరు పిల్లతో కలిసి పరిగి నుంచి షాద్‌నగర్‌వైపు కారులో ప్రయాణిస్తున్నాడు. ఈ క్రమంలో సుగుణ స్టీల్ ఫ్యాక్టరీ నుంచి లోడ్‌తో బయటకు వస్తున్న లారీ కారును బలంగా ఢీకొట్టింది. దీంతో కారులో శంకర్‌రావుతో పాటు కుటుంబ సభ్యులు గాయపడ్డారు. ఇదే విషయమై ఎస్‌ఐ మోహన్‌కృష్ణను వివరణ కోరగా ఎలాంటి ఫిర్యాదు అందలేదని చెప్పారు.
విధులకు ఆటంకం కలిగించిన వ్యక్తికి
రూ.పదివేల జరిమానా
పూడూరు: ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించిన వ్యక్తికి ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ (జేఎఫ్‌సీఎం) కోర్టు జరిమానా విధించింది. చన్గోముల్ ఎస్‌ఐ భరత్‌రెడ్డి తెలిపిన ప్రకారం.. చేవెళ్ల మండలం దామరగిద్దకు చెందిన మిట్ట విజయసింహారెడ్డి 2017లో పూ డూరు తహసీల్దార్ సంగీతరాణిపై దాడి చేసి విధులకు ఆటంకం కలిగించినట్లు ఎస్‌ఐ శేఖర్ కేసు నమోదు చేసి సంబంధిత పత్రాలను కోర్టుకు సమర్పించారు. వాదోపవాదనలు విన్న న్యాయమూర్తి నాగుల శిల్ప సోమవారం విజయసింహారెడ్డిని దోషిగా నిర్ధారించి రూ.10 వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.
రేషన్ డీలరుపై చర్యలు తీసుకోవాలి
ఎమ్మార్పీఎస్ జిల్లా కార్యదర్శి మహేందర్
యాలాల: మండల పరిధిలోని నాగసముందర్ రేషన్ డీలరు బియ్యం సరఫరాలో అక్రమాలకు పాల్పడుతున్నారని.. సంబంధిత డీలరుపై చర్యలు తీసుకోవాలని ఎమ్మార్పీఎస్ జిల్లా కార్యదర్శి డప్పు మహేందర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన తహసీల్దార్ వెంకటస్వామి, ఎంపీడీఓ శ్రీనిజకు ఫిర్యాదు చేశారు. గ్రామానికి చెందిన రేషన్ డీలరు ఈడ్గి పద్మమ్మ రేషన్ కార్డుదారులకు బియ్యం ఐదు కిలోల చొప్పున తక్కువగా ఇస్తుందని ఆరోపించారు. ఇదేమని ప్రశ్నించిన వారితో దురుసుగా ప్రవర్తిస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
వ్యాపారస్తుల సహకారంతో మార్కెట్ అభివృద్ధి
వ్యాపారస్తుల సహకారంతో మార్కెట్ అభివృద్ధి


