బల్దియా చైర్మన్లు
తాండూరు: తాండూరు నియోజకవర్గం వలస నేతలకు కలిసి వస్తుందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీ పీఠంపైనా వారినే కూర్చోబెడుతున్నారు. అదే దారిలో తాండూరు మున్సిపల్ చైర్మన్‌లుగా నియోజవకర్గంలోని మండలాలకు చెందిన నాయకులు తొలినాళ్ల నుంచి చైర్మన్‌లుగా కొనసాగారు. త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో నాన్ లోకల్ లీడర్స్ చైర్మన్ పదవి కోసం పోటీ పడుతుండగా మరోవైపు లోకల్ నాయకులకే చైర్మన్ స్థానం కల్పించాలంటూ ఆయా పార్టీల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
ఆరుగురు లోకల్
తాండూరు ప్రాంతం నిజాం పాలనలో కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గా జిల్లాలో ఉండేది. నాటి కాలంలో నిజాం పాలకులు నియమించిన తాలూకా తహసీల్దార్లు పాలించేవారు. 1952లో నిజాం సంస్థానం భారతదేశంలో విలీనమైంది. 1953లో పట్టణంలోని సాయిపూర్, మల్‌రెడ్డిపల్లి, తాండూరు రెవెన్యూ గ్రామాలను మున్సిపల్ శాఖ ఆధీనంలోకి తీసుకుని మున్సిపాలిటీగా ఏర్పాటు చేశారు. నాటి నుంచి 12 మంది మున్సిపల్ చైర్మన్‌లుగా కొనసాగారు. తాండూరు తొలి మున్సిపల్ చైర్మన్‌గా ముదెళ్లి నారాయణరావు ఎన్నికయ్యారు. ఇక్కడ తాండూరు మున్సిపల్ కేంద్రం నుంచి ఆరుగురు చైర్మన్‌లుగా వ్యవహరించగా మిగిలిన వారంతా నియోజకవర్గంలో వివిధ మండలాలకు చెందిన వారే.
ఆశావహుల ప్రయత్నాలు ముమ్మరం
ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో చైర్మన్ పీఠం స్థానికులను వరిస్తోందా? స్థానికేతరులకేనా అనే విషయం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. అధికార కాంగ్రెస్ నుంచి నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన నాయకులు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్నారు. మున్సిపల్ మాజీ చైర్మన్ లక్ష్మారెడ్డి తనయుడు మహిపాల్‌రెడ్డి, తాండూరు జెడ్పీటీసీ మాజీ సభ్యుడు, డీసీసీబీ వైస్ చైర్మన్ రవిగౌడ్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. బీఆర్‌ఎస్ నుంచి ప్రస్తుతం లోకల్ నాయకుడి పేరు వినిపిస్తోంది. కాగా కాంగ్రెస్ నాయకులు పట్టణానికి చెందిన వారి అభ్యర్థిత్వమే ఖరారు చేయాలంటూ ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డిని కోరుతున్నారు.
తాండూరు పీఠమెక్కిన స్థానికేతరులు
చైర్మన్ పదవీకాలం గ్రామం మండలం
పుల్లా అనంత్‌రెడ్డి 1959–1961 గొట్లపల్లి పెద్దేముల్
పుల్లా అనంత్‌రెడ్డి 1981–1982 గొట్లపల్లి పెద్దేముల్
సత్తయ్యగౌడ్ 1982–1983 గోరేపల్లి యాలాల
పుల్లా మోహన్‌రెడ్డి 1983–1986 గొట్లపల్లి పెద్దేముల్
పుల్లా మోహన్‌రెడ్డి 1987–1992 గొట్లపల్లి పెద్దేముల్
నాగారం నర్సింలు 1995–2000 కొత్తపల్లి పెద్దేముల్
విశ్వనాథ్‌గౌడ్ 2000–2005 అల్లాపూర్ తాండూరు
లక్ష్మారెడ్డి 2005–2010 రుద్రారం పెద్దేముల్
చైర్మన్ పదవీకాలం
ముదెళ్లి నారాయణరావు 1953–1959
కోర్వార్ పార్వతప్ప 1961–1962
శెట్టి చంద్రశేఖర్ 1962–1972
కోట్రిక విజయలక్ష్మి 2014–2017
సునీతాసంపత్ 2017–2019
తాటికొండ స్వప్న 2020–2025
బల్దియా చైర్మన్లు


