‘అమృత్ 2.0’ దొంగల ముఠా గుట్టురట్టు
పరిగి: అమృత్ 2.0 ప్రాజెక్ట్ పైపులు, సామగ్రిని అపహరిస్తున్న దొంగల ముఠా గుట్టును పరిగి పోలీసులు రట్టు చేశారు. ఆదివారం సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఎస్పీ రాములు నాయక్ కేసు వివరాలు వెల్లడించారు. 2025 డిసెంబర్ 6న బ్రిలియంట్ స్కూల్ ఎదుట ఖాళీ స్థలంలో అమృత్ 2.0 ప్రాజెక్టు కోసం తీసువకుచ్చిన సుమారు రూ.13లక్షల విలువైన 115 డీఐ పైపులు చోరీకి గురైనట్లు ప్రాజెక్టు మెనేజర్ వెంకటరమణ పోలీసులకు పిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు టీఎస్ 07 యూకే 2448 నంబర్ డీసీఎంలో పైపులు ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. ఆదివారం తెల్లవారుజామున 4గంటల సమయంలో ఐదుగురు దొంగలు ఒక డీసీఎంలో వచ్చి బ్రిలియంట్ స్కూల్ దగ్గర పైపులను చూస్తుండగా పోలీసులు గమనించి పట్టుకున్నారు. వారిని విచారించగా పరిగితో పాటు పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడినట్టు నిందితులు ఒప్పుకొన్నారు. చోరీ చేసిన పైపులు నగరంలోని రాంబాబు, సంతోశ్ కలిసి నాచారంలోని విక్రమ్ గోయోల్, టోలిచౌకిలో సుల్తాన్‌బాయ్, రాజుకు అమ్మినట్లు చెప్పారు. చోరీలకు పాల్పడిన రాంబాబు, శ్రీను, అప్పలరాజు, సహదేవ్, మధూకర్, సురేశ్‌ను రిమాండ్‌కు తరలించగా సంతోశ్ పరారీలో ఉన్నట్లు తెలిపారు.
హాలియాలో అరెస్ట్.. బెయిల్
వీరు 2025 డిసెంబర్ 10న వికారాబాద్ పట్టణ కేంద్రంలోని ఓ కళాశాల ఎదుట 20 పైపులు, డిసెంబర్ 18న నల్గొండ జిల్లా హాలియాలో నాగార్జునసాగర్ రోడ్డులో 17 పైపులు వాహనంలో లోడ్ చేస్తుండగా స్థానికులు పోలీసులకు అప్పజెప్పగా అక్కడి పోలీసులు రిమాండ్‌కు తరలించారు. బెయిల్‌పై వచ్చిన నిందితులు ఆదివారం పరిగిలో చోరీకి యత్నిస్తుండగా ఆరుగురు దొంగల ముఠాను పరిగి పోలీసులు పట్టకుని రిమాండ్‌కు తరలించారు. నిందితుల నుంచి డీసీఎం, రూ.4 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సమావేశంలో సీఐ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్‌ఐ మోహనకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
పైపుల చోరీ కేసును ఛేదించిన పోలీసులు
ఓ డీసీఎం, రూ.4లక్షల నగదు స్వాధీనం
కేసు వివరాలు వెల్లడించిన ఏఎస్పీ రాములునాయక్


