కబ్జా కోరల్లో .. | - | Sakshi
Sakshi News home page

కబ్జా కోరల్లో ..

Jan 12 2026 8:12 AM | Updated on Jan 12 2026 8:12 AM

కబ్జా కోరల్లో ..

కబ్జా కోరల్లో ..

ఫొటోలో కనిపిస్తున్నది శివసాగర్‌ ప్రాజెక్టు.. హైదరాబాద్‌కు చెందిన కొంత మంది రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు ప్రాజెక్టు పరిసరాల్లో నీరు నిలిచే ప్రాంతాన్ని కబ్జా చేశారు. అంతటితో ఆగని అక్రమార్కులు నిబంధనలకు విరుద్ధంగా ఫాంహౌస్‌ల నిర్మించి బీటీ రోడ్లు వేశారు. గతంలో జిల్లాలో విధులు నిర్వహించిన ఓ ఉన్నతాధికారి సైతం ప్రాజెక్టు శిఖంలో పొలాన్ని నిబంధనలకు విరుద్ధంగా తమ బంధువులకు కట్టబెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు రికార్డులు సైతం తారుమారు చేసినట్టు వినికిడి.

ఫైవ్‌ మెన్‌ కమిటీదే బాధ్యత

అక్రమార్కులు ఆక్రమణలకు పాల్పడుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని వికారాబాద్‌ మున్సిపల్‌ అధికారులను ప్రశ్నిస్తే.. ఫైవ్‌మెన్‌ కమిటీ నివేదిక ప్రకారమే నిర్మాణాలు, వెంచర్లకు అనుమతులు ఇస్తారు. తాము చేసేదేం లేదంటూ దాటవేస్తున్నారు. ఇటీవల చెరువు బఫర్‌జోన్‌లో సైతం వెంచర్లు చేస్తున్నారు. మట్టి పోసి పూడ్చివేస్తున్నా అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు.

తాగునీటి వనరుకు ఎసరు

మిషన్‌ భగీరథ నీటి సరఫరాలో ఏదైనా సమస్య ఏర్పడితే జిల్లా కేంద్రానికి తాగునీటి అవసరాలు తీర్చేందుకు ఉన్న ఏకై క ప్రత్యామ్నాయం శివసాగర్‌ మాత్రమే. 2.25 క్యూబిక్‌ మిలియన్‌ లీటర్లు ఈ చెరువు సామర్థ్యం కాగా నిరంతరంగా వాడితే కొద్ది రోజుల్లోనే చెరువు మొత్తం అడుగంటే అవకాశం ఉంది. దశాబ్ద కాలంగా ప్రాజెక్టు నాలుగు వైపులా కబ్జాలకు గురవుతోంది. కొందరు బడా బాబులు ఫాంహౌస్‌లు నిర్మిస్తుండగా మరికొందరు ప్లాట్లు చేసి విక్రయిస్తున్నారు.

అందరూ పాత్రదారులే!

చెరువు కబ్జాలో అధికారులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు ఇలా అందరు పాత్రదారులుగా మారుతున్నారు. కొందరు ముఖ్య నేతల కనుసన్నల్లోనే వెంచర్లు ఏర్పాటు చేస్తున్నారనే ఆరోపనలు వినిపిస్తున్నాయి. చెరువుతో పాటు చుట్టు పక్కల అసైన్డ్‌ భూములు సైతం కబ్జా చేసి వెంచర్లలో కలుపుకొంటున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో అధికారులతో పాటు ముఖ్య నేతల హస్తం కూడా ఉండటంవల్లే కబ్జాలకు అడ్డుకట్ట పడటంలేదని స్పష్టమవుతోంది. కోట్ల రూపాయలు సంపాదిస్తున్న రియల్టర్లు, కబ్జాదారులు నేతలకు, అధికారులు పర్సెంటేజీలు ఇస్తున్నట్టు పట్టణ వాసులు ఆరోపిస్తున్నారు.

ఎఫ్‌టీఎల్‌ పరిధిలో అక్రమార్కులు వేసిన ఫెన్సింగ్‌

భూముల ధరలకు రెక్కలు రావడంతో అక్రమార్కులు చెరువులు, కుంటలు, నాలాలు, వాగుల వంటి ప్రభుత్వ భూముల ఆక్రమణలకు పాల్పడుతున్నారు. పొలాల్లో కలుపుకోవడం, వెంచర్లు, గెస్ట్‌హౌస్‌లు నిర్మిస్తున్నారు. సంబంధిత అధికారులు అటుగా కన్నెత్తి చూడకపోవడంతో వారి ఆగడాలకు అడ్డూ అదుపులేకుండా పోతోంది.

– వికారాబాద్‌

శివసాగర్‌ ప్రాజెక్టు

అధికారులు, ప్రజాప్రతినిధుల అండదండలతో రెచ్చిపోతున్న అక్రమార్కులు

బఫర్‌జోన్‌లో వెంచర్ల ఏర్పాటు

పట్టించుకోని పాలకులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement