ప్రమాదంలో ఆడపిల్లల భద్రత
విద్యార్థినిని ధారుణంగా అవమానించిన అధ్యాపకులు
అనంతగిరి. ఆడపిల్లల భద్రత ప్రమాదంలో పడిందని, ఎక్కడా రక్షణ లేకుండా పోయిందని తెలంగాణ ఆడపిల్లల సమానత్వ సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి కృప, పీఓడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి గీత అన్నారు. సికింద్రాబాద్ మారేడుపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన సంఘటనకు నిరసనగా.. శనివారం వారు వికారాబాద్‌లో ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కళాశాలలో జరిగిన సంఘటన సమాజం తలదించుకునేలా ఉందన్నారు. ఓ విద్యార్థిని లెక్చరర్లు పీరియడ్స్ ప్రూఫ్ చూపించాలని అడగటమే కాకుండా.. ఎగతాళి చేయడం అత్యంత అమానుషమని ఆగ్రహం వ్యక్తం చేశారు. జరిగిన అవమానాన్ని భరించలేక, తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన సదరు యువతి.. ఇంటికి వెళ్లగానే కుప్పకూలి, మెదడులో రక్తం గడ్డకట్టి మృతి చెందిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనతో విద్యా సంస్థల్లో బాలికలకు భద్రత, గౌరవం ఎలా ఉందో స్పష్టంగా తెలుస్తోందని పేర్కొన్నారు. ఈ విషాదకర సంఘటనపై ప్రభుత్వం స్పందించి, బాధ్యులైన లెక్చరర్లను తొలగించడంతో పాటు, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమంలో సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు జ్యోతి, లలిత, మాధవి, ఎంవీఎఫ్ సిబ్బంది శ్రీనివాస్, ఉమా, దేవకుమారి, ఆశలత, శ్రీలత తదితరులు పాల్గొన్నారు.
అగౌరవం భరించలేక
కుప్పకూలి యువతి మృతి
లెక్చరర్లపై చర్యలు తీసుకోవాలి:
పీఓడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి గీత


