జీపీల్లో.. మరో ఆప్షన్
పరిగి: పంచాయతీల్లో కో ఆప్షన్ సభ్యుల పదవికి పోటాపోటీ నెలకొనే పరిస్థితి కనిపిస్తోంది. గతంలో కో ఆప్షన్ పదవులు కేవలం మండల, జిల్లా పరిషత్‌లలో మాత్రమే ఉండేవి. వీటిని మైనార్టీలతో పాటు ఇతరులకు కట్టబెట్టేవారు. ఇందులో స్థానిక ఎమ్మెల్యే ఎవరివైపు మొగ్గు చూపితే, వారికే అవకాశం దక్కేది. పంచాయతీరాజ్ 2018 నూతన చట్టం ప్రకారం జీపీల్లో సైతం ముగ్గురు కోఆప్షన్ సభ్యులను నియమించాలి. ప్రస్తుతం ఈ పదవులపై చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. సర్పంచ్‌లతో పాటు మండల స్థాయి నాయకులను కలుస్తూ అవకాశం కల్పించాలని కోరుతున్నారు. గతేడాది డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో మూడు విడతలుగా జిల్లాలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు. ఈప్రక్రియ పూర్తి కావడంతో గ్రామాల్లో సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులు కొలువుదీరారు. ప్రస్తుతం వీరు తమ పల్లెల్లో నెలకొన్న సమస్యల పరిష్కారంపై దృష్టిసారించారు. సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేయని రాజకీయ నాయకుల కన్ను ఇప్పుడు కో ఆప్షన్ పదవిపై పడింది.
ముగ్గురు చొప్పున..
జిల్లాలో 594 గ్రామ పంచాయతీలున్నాయి. ఒక్కో జీపీలో ముగ్గురు చొప్పున కో ఆప్షన్ మెంబర్లను నియమించనున్నారు. దీంతో జిల్లాలోని 594 పంచాయతీల్లో మొత్తం 1,782 మంది కోఆప్షన్ సభ్యులను ఎన్నుకోనున్నారు.
సమాన హోదా..
● కో ఆప్షన్ సభ్యులుగా ఎన్నికై న వారికి గ్రామ సభలు, పంచాయతీ సమావేశాల్లో ప్రత్యేక స్థానం ఉంటుంది.
● వార్డు సభ్యులతో సమానంగా హోదా, ప్రొటోకాల్ వర్తిస్తుంది.
● అన్ని అధికారిక కార్యక్రమాలకు పంచాయతీ తరఫున ఆహ్వానం అందుతుంది.
● సమావేశాల్లో పాల్గొని చర్చించడంతో పాటు తగిన సలహాలు, సూచనలు ఇవ్వవచ్చు.
● కానీ ఏదైన తీర్మానంపై ఓటు వేసే హక్కు ఉండదు. కేవలం సలహాదారులుగా మాత్రమే వ్యవహరించాల్సి ఉంటుంది.
అర్హులు వీరే..
● గ్రామంలోని మహిళా సమాఖ్య సంఘం అధ్యక్షురాలు కో ఆప్షన్ సభ్యులుగా పరిగణించడతారు. వీరిని తప్పకుండా ఎంపిక చేయాలి.
● గ్రామానికి చెందిన ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగిని కో ఆప్షన్ మెంబర్‌గా తీసుకోవచ్చు.
● పంచాయతీ అభివృద్ధికి సహకరించిన వారు, స్థల దాతలను సభ్యుడిగా ఎన్నుకోవచ్చు.
మెజార్టీకే పదవి
ప్రస్తుతం కో ఆప్షన్ సభ్యుల ఎంపిక ప్రక్రియ నేతల చేతుల్లోకి వెళ్లిపోయిందనే వాదనలున్నాయి. వారు ఎవరిని అనుకుంటే వారికే పదవులు దక్కే పరిస్థితులు నెలకొన్నాయి. సభ్యుల భర్తీకి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు వెలువడలేదు. అయినప్పటికీ గతంలో మాదిరిగానే వీరిని ఎన్నుకుంటారనే ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో ఆశావహులు ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించారు. పంచాయతీల్లో ఏ పార్టీ మెజార్టీలో ఉంటే వారికే కో ఆప్షన్ పదవులు దక్కే చాన్స్ ఉంటుంది. ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చాక చూద్దాంలే అనుకుంటే.. అప్పటికే ఇతరులకు మాటిచ్చామని చెబుతారేమోననే అనుమానంతో ఆశావహులు నేతలను సంప్రదించి, తమ మనసులో మాట చెప్పేస్తున్నారు. కో ఆప్షన్ పదవిని తమకు ఇవ్వాలని కోరుతున్నారు.
కో ఆప్షన్ పదవులపై
ఆశావహుల నజర్
ప్రతీ పంచాయతీలో
ముగ్గురికి అవకాశం
ఈసారి పోటాపోటీ
తప్పదంటున్న నేతలు


