ప్లంబింగ్ పనులు చేస్తుండగా ప్రమాదం
విద్యుదాఘాతంతోఇద్దరికి తీవ్ర గాయాలు
మంచాల: విదు్‌య్‌త్ ప్రమాదంలో ఇద్దరు ప్లంబర్లు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మండల కేంద్రంలో శనివారం చోటు చేసుకుంది. వివరాలు.. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆరుట్లకు చెందిన ప్లంబర్లు సాతిరి నవీన్, బూర త్రీశూల్ బాత్‌రూం మరమ్మతులు పనులు చేపట్టారు. ఈ క్రమంలో ట్యాంకు పక్కన ఇనుపరాడ్‌ను తొలగిస్తుండగా సమీపంలోని 33 కేవీ విద్యుత్ వైర్లు తగిలి షార్ట్‌సర్క్యూట్ అయింది. దీంతో మంటలు చెలరేగి ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన సిబ్బంది వెంటనే గ్రామస్తుల సహకారంతో 108 అంబులెన్స్‌లో ఇబ్రహీంపట్నంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. రాష్ట్ర విద్యాశాఖ కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి, ఇతర అధికారులు ఎప్పటికప్పుడు ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తూ మెరుగైన వైద్యం నిమిత్తం సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రికి తీసుకెళ్లారు. క్షతగాత్రులను పరామర్శించినట్లు గ్రామస్తులు తెలిపారు. ప్రమాద సమయంలో మంటలు చెలరేగడంతో ట్రిప్ అవడంతో విద్యుత్‌సరఫరా నిలిచిపోయి పెనుప్రమాదం తప్పింది.
వేద విద్యతో విజ్ఞానం
మొయినాబాద్‌రూరల్: విద్య విజ్ఞానాన్ని పెంపొందిస్తుందని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, వికారాబాద్ ఎస్పీ స్నేహ మెహ్రా పేర్కొన్నారు. చిలుకూరు రెవెన్యూ పరిధిలోని జేబీఐటీ ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో శనివారం గాయత్రీ వేద ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న వేద పాఠశాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వేదం బుద్ధితో కూడిన విజ్ఞానం అని అన్నారు. వేద పాఠశాల ఏర్పాటుకు కృషి చేస్తున్న చైర్మన్ పురుషోత్తం లాలా, కమిటీ సభ్యులను అభినందించారు. కార్యక్రమంలో చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రభాకర్‌రెడ్డి, కంజర్ల ప్రకాష్, గోపాల్‌రెడ్డి, మోర నర్సింహారెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, నాయకులు పాల్గొన్నారు.
జిల్లా అస్తిత్వాన్ని రక్షించాలి
ఇబ్రహీంపట్నం: జిల్లా అస్తిత్వాన్ని రక్షించాలని జిల్లా సేవ్ టీచర్స్ ప్రతినిధులు శనివారం బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డికి విన్నవించారు. ఈ సందర్భంగా రాష్ట్ర గౌరవాధ్యక్షుడు బి.రవి, అధ్యక్షుడు బి.మధుకర్‌రెడ్డి, కార్యదర్శులు టి.సురేష్, జగదీశ్వర్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి హరికృష్ణ మాట్లాడుతూ.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 371(డీ) ద్వారా విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులకు కల్పించిన స్థానిక హక్కులను కాలరాస్తూ జిల్లా విభజన జరపడం అన్యాయమని అన్నారు. రాష్ట్రపతి 2018లో జారీ చేసిన ఉత్తర్వులతో కల్పించిన 95 శాతం స్థానిక వాటాను పూర్తిగా విస్మరించిందన్నారు. స్థానికులను స్థానికేతరులుగా మార్చి, స్థానికేతరులను స్థానికులు మార్చే విధంగా చర్యలు జరుగుతుండటం బాధాకరమన్నారు. జీఓ 317ను రద్దు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ నేటికి స్థానికత ఆధారంగా ఉద్యోగాల విభజన అమలు కాలేదని ఆందోళన వ్యక్తం చేశారు. స్పౌజ్ వంటి పేర్లతో వందలాది మంది నాన్ లోకల్స్ ఉపాధ్యాయులను జిల్లాలోకి తీసుకొచ్చినట్లు చెప్పారు. స్థానికులకు ఏమాత్రం న్యాయం జరగడంలేదన్నారు. వికారాబాద్ జిల్లాకు వెళ్లిన స్థానిక ఉపాధ్యాయులు ఇప్పటికీ అక్కడే పనిచేస్తున్నారని.. మరోసారి జిల్లా విభజన జరిగితే స్థానిక ఉపాధ్యాయులు మరింత నష్టపోతారన్నారు. సేవ్ టీచర్స్ ప్రతినిధులు భాషయ్య పాల్గొన్నారు.
ప్లంబింగ్ పనులు చేస్తుండగా ప్రమాదం


