పర్యాటకంగా ‘పరిగి’త్తిస్తా
● లక్నాపూర్ ప్రాజెక్టులో
సౌకర్యాల కల్పనకు కృషి
● ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి
● సుందరీకరణ పనులకు శంశుస్థాపన
పరిగి: పరిగి ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి అన్నారు. మండల పరిధి లక్నాపూర్ ప్రాజెక్టులో రూ.6 కోట్ల 83 లక్షల నిధులతో చేపడుతున్న సుందరీకరణ, పునరుద్ధరణ పనులకు శనివారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ఇటీవల పర్యాటకుల కోసం బోటింగ్ సౌకర్యం ఏర్పాటు చేశామని, దీంతో సందర్శకుల తాకిడి పెరిగిందన్నారు. పరిగి.. హైదరాబాద్‌కు సమీపంలో ఉండటంతో ఈ ప్రాంతం పర్యాటక ప్రాంతంగా మారనుందన్నారు. ప్రాజెక్టు వద్ద పర్యాటకుల కోసం కాటేజీల ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేశామని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం నిధులు కేటాయిస్తోందని, ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్నారు. దీంతో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని వెల్లడించారు. ఇచ్చిన మాట ప్రకారం పనులు చేస్తున్నామని, పరిగి– లక్నాపూర్ వరకు రెండు వరుసల రహదారి నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని, త్వరలోనే పూర్తవుతాయని పేర్కొన్నారు. జాఫర్‌పల్లి వద్ద 140 ఎకరాల్లో అర్బన్ పార్క్ నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. కార్యక్రమంలో ఏ బ్లాక్ అధ్యక్షుడు పార్థసారధి తదితరులు పాల్గొన్నారు.
పర్యాటకంగా ‘పరిగి’త్తిస్తా


