మైనర్లను పనిలో పెట్టుకుంటే కఠిన చర్యలు
అబ్దుల్లాపూర్‌మెట్: మైనర్లను పనిలో పెట్టుకుంటే కఠిన చర్యలు ఉంటాయని ఆపరేషన్ స్మైల్ టీం అబ్దుల్లాపూర్‌మెట్ సభ్యులు హెచ్చరించారు. ఆపరేషన్ స్మైల్–12లో భాగంగా మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పోలీస్ కమిషనర్ మెహంతి ఆదేశాల మేరకు ఉమెన్ సేఫ్టీ వింగ్ డీసీపీటీ ఉషారాణి సూచనలతో శనివారం అబ్దుల్లాపూర్‌మెట్ ఠాణా పరిధిలోని బాటసింగారంలోని గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్‌లోని వ్యాపారస్తులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 18 ఏళ్లలోపు బాలలను పనిలో పెట్టుకుంటే చట్టరీత్యా చర్యలు ఉంటాయన్నారు. బాలల హక్కులపై అవగాహన లేని వ్యాపారస్తులు వారిని వెంటనే తొలగించి హక్కులు కాపాడాలని ఆదేశించారు. వారిని ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయని వివరించారు. ఇళ్లలో పనిచేయించుకునే వారు సైతం స్వచ్ఛందంగా ఆశ్రమాలకు లేదంటే తల్లిదండ్రులకు అప్పగించాలని సూచించారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతీ ఒక్కరు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి ఏహెచ్‌టీయూ సభ్యులు ఎస్‌ఐలు రాములు, ఖలీల్, ఏఎస్‌ఐలు వెంకట్‌స్వామి, రంగారెడ్డి డబ్ల్యూపీ రజిత, వనస్థలిపురం స్మైల్ టీం సభ్యులు పాల్గొన్నారు.
ఆపరేషన్ స్మైల్ బృందం


