రైతన్నకు వరుణ గండం
వికారాబాద్: అకాల వర్షాలు రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. దాదాపు 15 రోజులుగా జిల్లాలోని పలుచోట్ల గాలివాన, వడగండ్ల వర్షం పడుతోంది. గాలి తీవ్రతకు వరి, బొప్పాయి, అరట, మామిడి ఇతర పంటలకు తీవ్ర నష్టం జరిగింది. ప్రస్తుతం వరి పంట చేతికొచ్చింది. పలు చోట్ల కోతలు ప్రారంభించారు. ఈ సమయంలో వర్షాలు పడుతుండటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. కొన్నిచోట్ల వరి నూర్పిళ్లు జరుగుతున్నాయి. కళ్లాలు, రోడ్లపైన వడ్లను ఆరబోశారు. మరి కొన్ని చోట్ల పొలాల్లో కోతలు కోసి ఉంచారు. ఇలాంటి పరిస్థితుల్లో అకాల వర్షాలు కురుస్తుండటంతో ధాన్యం ఎక్కడికక్కడ తడిసిపోతోంది. తడిసిన ధాన్యానికి గిట్టుబాటు ధర రాదని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇదిలా ఉండగా జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటి దాదాపు 15 వేల నుంచి 20 వేల ఎకరాల్లో పంటలకు నష్టం జరిగింది.
వర్షాలు పడితే మరింత నష్టం
ప్రస్తుతం యాసంగి పంటలు పూర్తిస్థాయిలో చేతికి వచ్చాయి. వరి, వేరుశనగ, మొక్కజొన్న, జొన్న పంటల కోతలు ప్రారంభమయ్యాయి. వడ్లను ఆరబోయడం, నూర్పిడి చేసే పనుల్లో రైతులు నిమగ్నమయ్యారు. ఈ తరుణంలో అకాల వర్షాలు పడుతుండటం ఆందోళన కలిగిస్తోందని రైతులు అంటున్నారు. వర్షాలు ఇలాగే పడితే పూర్తిగా నష్టపోతామని వారు పేర్కొన్నారు.
సౌకర్యాలు కల్పించాలి
వర్షాలు పడుతున్న నేపథ్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద వడ్లు ఆరబెట్టుకునేందుకు సౌకర్యాలు కల్పించాలని రైతులు అధికారులను కోరుతున్నారు. కళ్లాలు, రోడ్లపై ధాన్యం ఆరబోస్తే తడిసిపోయే ప్రమాదం ఉందని తెలిపారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తెస్తే తిరిగి పంపుతారని, ఒక వేళ కొన్నా మద్దతు ధర రాదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత సీజన్‌లో 92 వేల ఎకరాల్లో వరి పంటను సాగు చేశారు. 2.25 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడవకుండా ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉంది.
అకాల వర్షాలు, వడగళ్ల్లకు దెబ్బతింటున్న పంటలు
తడిసి ముద్దవుతున్న ధాన్యం
గాలి తీవ్రతకు నేలకొరిగిన బొప్పాయి, అరటి చెట్లు
మామిడి రైతుకు భారీ నష్టం
అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం
జిల్లాలో ధాన్యం సేకరణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. త్వరలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తాం. ప్రస్తుతం వర్షాలు పడుతున్నందున రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలి. ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కొనుగోలు కేంద్రాల్లో వడ్లు తడవకుండా టార్పాలిన్లను అందుబాటులో ఉంచాయి.
– లింగ్యానాయక్, అడిషనల్ కలెక్టర్


