కనీస వేతనం అందించాలి
కొడంగల్ రూరల్: ఇతర జిల్లాల్లో ఇచ్చే వేతనాల మాదిరిగానే తమకు ఇవ్వాలని స్థానిక మిషన్ భగీరథ కార్మికులు డిమాండ్ చేశారు. బుధవారం మిషన్ భగీరథ సంప్‌హౌజ్ ఎదుట మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా మిషన్ భగీరథలో పనిచేస్తున్న తమను గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర జిల్లాల్లో కార్మకులకు రూ.15,500లు చెల్లిస్తుండగా కొడంగల్‌లో కేవలం రూ.10,900లు మాత్రమే అందిస్తున్నారని వాపోయారు. గతంలో 9,900లు అందించేవారని, ఈ నెల నుంచే వెయ్యి రూపాయలను పెంచారన్నారు. గత ఆరు నెలల నుంచి ఈపీఎఫ్ జమ చేయడంలేదని, తమ సమస్యల పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం కొడంగల్ మిషన్ భగీరథ అధికారులకు వినతిపత్రం అందించారు. గురువారం సమస్యలను పరిష్కరించని పక్షంలో శుక్రవారం నుంచి విధులు బహిష్కరిస్తూ సమ్మె చేయనున్నట్లు తెలిపారు. అధికారులు స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో రాంచందర్, వెంకటయ్య, అబ్దులప్ప, ఆదిత్య, హరిప్రసాద్ తదతరులు పాల్గొన్నారు.
● సమస్యలు పరిష్కరించకుంటే
సమ్మె చేపడుతాం
● మిషన్ భగీరథ కార్మికులు


