వివాహేతర సంబంధానికి అడ్డుగా మారాడని ప్రియుడితో కలిసి భర్త హత్య | - | Sakshi
Sakshi News home page

వివాహేతర సంబంధానికి అడ్డుగా మారాడని ప్రియుడితో కలిసి భర్త హత్య

Jun 23 2023 2:50 AM | Updated on Jun 23 2023 1:47 PM

రాములు (ఫైల్‌) - Sakshi

రాములు (ఫైల్‌)

అనంతగిరి: వివాహేతర సంబంధానికి అడ్డుగా మారాడనే కారణంతో ఓ మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను కడతేర్చింది. ఈ సంఘటన వికారాబాద్‌ పీఎస్‌ పరిధిలో వెలుగు చూసింది. సీఐ శ్రీను తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. వికారాబాద్‌ మండల పరిధిలోని అత్వెల్లికి చెందిన నక్క రాములు(38) భార్య స్వప్న ఇదే గ్రామానికి చెందిన ఎం.పవన్‌కళ్యాణ్‌తో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయాన్ని గుర్తించిన రాములు పలుమార్లు ఆమెను మందలించాడు. దీంతో అతని అడ్డు తొలగించుకోవాలని ప్రియుడితో కలిసి కుట్ర పన్నింది. ఈ క్రమంలో ఇద్దరూ కలిసి బుధవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న రాములు గొంతు నులిమి చంపేశారు.

ఉదయాన్నే ఏమీ తెలియనట్లు స్వప్న రోదిస్తూ కూర్చుంది. మృతుడి మెడపై గాయాలను గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని వికారాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి వద్దకు చేరుకున్న ఇరు కుటుంబాల వారు గొడవ పెట్టుకుని.. పోస్టుమార్టం చేయకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ విషయం తెలుసుకున్న సీఐ తన సిబ్బందితో వెళ్లి పరిస్థితిని అదుపులోకి తెచ్చి, పోస్టుమార్టం పూర్తి చేయించారు. వికారాబాద్‌లో ఉండే మృతుడి చెల్లి ఎన్‌.యశోద ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వీరి విచారణలో అసలు వివరాలు బహిర్గతమయ్యాయి.

Advertisement
 
Advertisement
Advertisement