గరుడ గోవిందం | - | Sakshi
Sakshi News home page

గరుడ గోవిందం

Sep 20 2026 6:48 AM | Updated on Sep 20 2026 6:48 AM

● గోవింద నామస్మరణతో మారుమోగిన తుమ్మలగుంట ● 70 వేల మందికిపైగా భక్తులు దర్శించుకున్నట్లు అంచనా ● మోహినీ అవతారంలో పల్లకిపై విష్ణుమూర్తి అభయహస్తం

ఆరు గంటలపాటు వైభవంగా గరుడోత్సవం

తిరుపతి రూరల్‌: తిరుపతి రూరల్‌ మండలం తుమ్మలగుంట శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో అత్యంత విశిష్టమైన గరుడవాహన సేవ శనివారం రాత్రి అశేష భక్తజనుల మధ్య వైభవంగా జరిగింది. ఉత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం మోహినీ అవతారంలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. పల్లకీపై మోహినీ అవతారంలో ఊరేగుతున్న స్వామివారిని దర్శించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వాహన సేవ సాగేంతసేపూ మాడ వీధులు గోవింద నామస్మరణలు, వేద విద్యార్థుల మంత్ర పఠనంతో మార్మోగాయి. హారతులు, భజనలు, మంగళవాయిద్యాల నడుమ వాహన సేవ వైభవంగా కొనసాగింది. పల్లకీసేవకు తిరుపతి రూరల్‌ మండలం వేదాంతపురం, చిగురువాడ, మల్లంగుంట, దుర్గసముద్రం, కేసీపేట, రామానుజపల్లి, సి.గొల్లపల్లి, పైడిపల్లి, పాతకాల్వ పంచాయతీల నుంచి భక్తులు సారె తీసుకువచ్చి సమర్పించారు.

గోవింద నామస్మరణతో

పులికించిన తుమ్మలగుంట

శనివారం రాత్రి తుమ్మలగుంటలో శ్రీవారికి అత్యంత ప్రీతికరమైన గరుడ వాహనంపై కల్యాణ వేంకటేశ్వర స్వామి విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారి గరుడవాహన సేవను తిలకించేందుకు ఉమ్మడి చిత్తూరు జిల్లా నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో తుమ్మలగుంట వీధులన్నీ జనసంద్రంగా మారాయి. గరుడునిపై గోవిందుడు విహరిస్తుండగా భక్తులు గోవింద నామస్మరణతో పరవశించారు. సుమారు ఆరు గంటల పాటు సాగిన గరుడోత్సవం ముగిసే సమయానికి సుమారు 70 వేల మందికిపైగా భక్తులు స్వామి వారిని దర్శించుకున్నట్లు సమాచారం. భక్తుల రద్దీ దృష్ట్యా పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలను కఠినంగా అమలు చేశారు. గరుడవాహన సేవలో తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌ రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. భక్తులందరికీ సంతృప్తికరమైన దర్శనం కల్పించేలా ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement