● గరుడోత్సవ దర్శనానికి తప్పని తిప్పలు ● తిరుమల ఔటర్ రింగ్ రోడ్డులో వాహనాల కట్టడి ● ప్రయాణికులను సైతం అక్కడే దించేసిన ఆర్టీసీ
సాక్షి టాస్క్‌ఫోర్స్: గరుడ సేవ తిలకించడానికి తిరుమల చేరుకున్న సాధారణ భక్తుల పాట్లు అన్నీ ఇన్నీ కావు. తిరుమలలో అడుగడుగునా పోలీసుల ఆంక్షలు.. సరైన సమాచారం అందించే హెల్ప్ డెస్క్‌లు లేకపోవడం వంటి పరిణామాలతో శనివారం రాత్రి భక్తులు సతమతం అయ్యారు. ఆపై ప్రైవేట్ టాక్సీలకు అనుమతించగా పోగా టీటీడీ ఉచిత బస్సుల సేవలు అందుబాటులో లేకపోవడంతో వృద్ధులు, మహిళలు, చిన్న పిల్లలు నడవడానికి ఇబ్బందులు పడ్డారు. గురుడ సేవ రోజున శనివారం రాత్రి సొంత వాహనాల్లో తిరుమలకు వచ్చిన వారు, ఆర్టీసీ బస్సుల్లో విచ్చేసిన ప్రయాణికులను తిరుమల ఔటర్ రింగ్ రోడ్డులో వదిలేశారు. దీంతో వారు ఆయా మార్గాల్లో లగేజీని చేతపట్టి నడవడానికి కష్టాపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎలాగో రామబంగీచా బస్టాండ్ ప్రాంతానికి చేరుకున్న భక్తులు గరుడసేవ చూసేందుకు మాడ వీధుల్లోకి చేరుకునే క్రమంలో నిర్ధిష్టమైన సూచిక బోర్డులు లేక, సమాచారం అందించే సహాయ కేంద్రాలు కనిపించకపోవడంతో కొందరు తీవ్ర అసహనానికి గురయ్యారు. మరోవైపు సర్వదర్శనానికి వెళ్లే భక్తుల అవస్థలు వర్ణనాతీతంగా మారాయి. ప్రధానంగా రాంబగీచా బస్టాండు, బాలాజీ బస్టాండులో దిగిన ప్రయాణికులకు టీటీడీ ఉచిత బస్సుల సేవలు, ప్రైవేట్ క్యాబ్‌లు అందుబాటు లేవు. దీంతో సర్వదర్శనం వైకుంఠం కాంప్లెక్స్ వద్దకు చేరుకోవడానికి ఇబ్బందులు ఎదురయ్యాయి. తిరుమలలోని ప్రధాన మార్గాల్లో భక్తులు నడవలేక కాళ్ల నొప్పులతో కాసేపు కూర్చుందామనే లోపు అక్కడే బందోబస్తులో ఉంటున్న పోలీసులు లేవయ్యా.. లేవమ్మా అంటూ పక్కకు వెళ్లండంటూ ఆంక్షలు విధించారు. మరికొందరు భక్తులు గదులు పొందడానికి మార్గాలు తెలియక ఆపసోపాలు పడ్డారు. టీటీడీ ఉద్యోగులు, పోలీసులు, మీడియా గ్యాలరీల్లో వెళ్లే ప్రవేశ ద్వారం వద్ద కూడా గందరగోళ వాతావరణం నెలకొంది. తాము టీటీడీలో పనిచేస్తున్నా ఎందుకు ప్రవేశ ద్వారం వద్ద ఆంక్షలు పెట్టారంటూ కొందరు తమ గుర్తింపు కార్డులతో ప్రశ్నించినప్పటికీ.. పక్కన ఉండాలనే సమాధానం అసంతృప్తికి గురిచేసింది.


