పెళ్లకూరు : వ్యవసాయ విద్యుత్ మోటార్లు చోరీ చేసి ఆటోలో తీసుకెళుతుండగా ఆదివారం పునబాక గ్రామస్తులు పట్టుకున్నారు. అనంతరం నిందితులను పోలీసులకు అప్పగించారు. స్థానికుల సమాచారం మేరకు.. బుచ్చినాయుడుకండ్రిగ మండలంలో మూడు వ్యవసాయ విద్యుత్ మోటార్లు చోరీ చేసి ఆటోలో పునబాక గ్రామం మీదుగా శ్రీకాళహస్తికి తరలిస్తున్నారు. ఈక్రమంలో గ్రామస్తులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. చోరీకి పాల్పడినవారు సూళ్లూరుపేట, శ్రీకాళహస్తి, పునబాక గ్రామాలకు చెందిన వ్యక్తులుగా గుర్తించి పోలీసులకు అప్పగించారు. ఈమేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
ఓజిలి : ఆర్థిక, అనారోగ్య సమస్యల కారణంగా ఆత్మహత్యకు యత్నించిన ఓ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. వివరాలు.. ఓజిలికి చెందిన మైలాం జయచంద్రారెడ్డి(48) ఈనెల 20వ తేదీన మామిడి కాలువ సమీపంలోని పొలాల వద్ద పురుగులు మందు తాగేశాడు. వెంటనే కుటుంబీకులు జయచంద్రారెడ్డిని నెల్లూరులోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. మెరుగైన వైద్య కోసం నాలుగురోజులు క్రితం చైన్నెకు తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. పోలీసులు ఈ మేరకు మృతదేహానికి నాయుడుపేట ప్రభుత్వాస్పతిలో పోస్టుమార్టం చేయించి బంధువులకు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


