ఓవరాల్ చాంపియన్‌గా ఎన్‌ఎస్‌యూ
తిరుపతి సిటీ: జాతీయ సంస్కృత వర్సిటీ వేదికగా నాలుగు రోజులుగా జరిగిన సౌత్‌జోన్ సాంస్క్రిట్ స్టూడెంట్స్ స్పోర్ట్స్ మీట్–2026 ఘనంగా ముగిసింది. దేశంలోని 13 వర్సిటీల నుంచి 200 మంది క్రీడాకారులు పాల్గొన్న స్పోర్ట్స్ మీట్‌లో తిరుపతి జాతీయ సంస్కృత వర్సిటీ విద్యార్థులు పలు పోటీల్లో ప్రతిభ చూపి, ఓవరాల్ చాంపియన్ షిప్ ట్రోఫీని సొంతం చేసుకున్నారు. మంగళవారం వర్సిటీలో జరిగిన ముగింపు కార్యక్రమానికి యునైటెడ్ నేషన్స్ అసోసియేషన్ ఆఫ్ ఏపీ అండ్ తెలంగాణ జనరల్ సెక్రటరీ ఎల్ జయరాములు ముఖ్యఅతిథి విచ్చేసి ప్రసంగించారు. సంస్కృత విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తే తమ తరఫున ఇంటర్నేషనల్ స్పాన్సర్షిప్ అందజేస్తామని హామీ ఇచ్చారు. అలాకే వర్సిటీకి రెండు గోల్డ్ మెడళ్లు, బెస్ట్ రీసెర్చ్ గోల్డ్‌మెడల్, స్పోర్ట్స్‌లో ప్రతిభ కనబరచిన వారికి రెండు క్రీడా గోల్డ్ మెడల్స్ అందజేస్తామని చెప్పారు. వీసీ జీఎస్‌ఆర్ కృష్ణమూర్తి మాట్లాడుతూ సంస్కృత విద్యతో పాటు విద్యార్థులను క్రీడల వైపు ప్రోత్సహించేందుకు సౌత్‌జోన్ స్పోర్ట్స్ మీట్ గత ఏడాది నుంచి నిర్వహిస్తున్నామన్నారు. వచ్చే ఏడాది నుంచి అఖిల భారత స్థాయిలో స్పోర్ట్స్ మీట్ నిర్వహించేందుకు కృషి చేస్తామని చెప్పారు. అనంతరం స్పోర్ట్స్ మీట్‌లో పాల్గొని పలు విభాగాలలో ప్రతిభ చూపి పతకాలను గెలుచుకున్న క్రీడాకారులకు అతిథులు ట్రోఫీలు, ప్రశంసాపత్రాలు, బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ వి సేతురామ్, స్పోర్ట్స్ మీట్ చైర్మన్ ప్రొఫెసర్ దక్షిణమూర్తి శర్మ, డీన్ ప్రొఫెసర్ రజనీకాంత్ శుక్లా, రిజిస్ట్రార్ వెంకటనారాయణ పాల్గొన్నారు.


